అన్నం వండుతుండగా పొరపాటున ఆ భార్య తల వెంట్రుక అలా అలా వెళ్లి అందులో పడింది. పాపం భర్త గారు రోజంతా బాగా కష్టపడి మంచి ఆకలి మీద రాత్రికి ఇంటికి వచ్చారు. శుభ్రంగా స్నానం చేసి భోజనానికి రెడీ అయ్యారు. ఘుమఘుమలాడే వంటకాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. లొట్టలేసుకుని తినడానికి రెడీ అవుతుండగా, ఆ అన్నం మీద నల్లగా నిగనిగలాడుతూ ఒక తల వెంట్రుక కనిపించింది. అంత మంచి అన్నమ్మీద దానిని చూసిన ఆ భర్తగారి కోపం నషాలానికి అంటింది.
‘ఏమిటిది?’అన్నాడు. పాపం ఆ భార్య పై ప్రాణాలు పైనే పోయాయి.
‘ఏమిటిది?’ అని మళ్లీ గర్జించాడు
‘తలవెంట్రుక’ అని ఆమె సమాధానమిచ్చింది.
‘ఎవరిది? ఎక్కడ నుంచి వచ్చింది?’ అని హూంకరించగానే…
‘నాదేనండి’ అని వణుకుతూ చెప్పింది.
అంతే భర్తగారి కోపం నషాలానికి అంటింది.
’’అన్నం వండేటప్పుడు జాగ్రత్తగా వండటం రాదా? నీకు….‘‘
అంటూ ఇద్దరు స్నేహితులకి ఠక ఠకా ఫోన్ చేసి, వారి సహాయంతో భార్యకి నున్నగా గుండు కొట్టించేశాడు.
‘‘ఇక నుంచి వంట చేసేటప్పుడు…ఒక్క వెంట్రుక కూడా రాదు’ అని తేల్చేశాడు. అంతే అంతటి ఆ అమాయకురాలు…ఒక్కసారి ఆదిశక్తిగా మారిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద భర్త, ఇద్దరి స్నేహితులపై కూడా కేసులు పెట్టేసింది.
ఇంతకీ విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. పీలీభీత్ జిల్లాలోని మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్ కు, సీమాదేవి(30)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి అత్తింటివారు రూ.15లక్షలు కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నట్టు సీమాదేవి పోలీసులకు తెలిపింది. వివాహిత కంప్లయింట్ ఆధారంగా పోలీసులు గుండు కొట్టించిన భర్తను చక్కగా తీసుకెళ్లి అరెస్టు చేసి ఆ అత్తారింటిలో అదేనండి జైలులో పెట్టారు.