స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ (అక్టోబర్ 1న) ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కసిరెడ్డి నారాయణరెడ్డి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కల్వకుర్తి జెడ్పీ వైస్‌ఛైర్మన్ బాలాజీ సింగ్ కూడా బీఆర్ఎస్ కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు.
చాలా మంది నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. లేదంటే బీజేపీలోకి వెళ్తున్నారు. ఈసారి తమకే టికెట్ వస్తుందని ఇన్నాళ్లు ఆశపడ్డ నేతలు.. రాదని తెలిసి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కసిరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఈ మధ్యే మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మైనంపల్లి రోహిత్, కుంభం అనిల్ కుమార్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన కుమారుడికి టికెట్ కేటాయించకపోవడంతో మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వేముల వీరేశం సైతం బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిలో ఉండగా తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు. వరుస చేరికలతో కాంగ్రెస్ జోష్ మీద ఉండగా.. కీలక నేతలు చేజారుతుండటంతో బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది.