కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. భారతదేశ రాజకీయాల్లో ఇదొక అపూర్వ ఘట్టం. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోడీ స్వంతం చేసుకున్నారు. అంతే కాదు వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు సృష్టించారు నరేంద్ర మోడీ.
నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసిన తరువాత 71 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రమంత్రుల్లో 30 మందికి క్యాబినెట్ హోదా లభించింది. ఐదుగురికి స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన 36 మందికి సహాయ మంత్రి హోదా లభించింది. తాజా మంత్రి మండలిలో ఐదుగురు తెలుగువారికి చోటు లభించింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. వీరిద్దిరూ బీజేపీ టికెట్‌పై లోక్‌సభ కు ఎన్నికైనవారే. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కు మంత్రి మండలిలో చోటు దొరికింది. వీరిలో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగు దేశం పార్టీ నుంచి లోక్‌సభ కు ఎన్నికయ్యారు. శ్రీనివాస్ వర్మ నరసాపురం నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు.
నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయు డు రికార్డు సృష్టించారు. కాగా పెద్ద వయస్కుడిగా హిందూస్థానీ అవామ్ మోర్చా వ్యవ స్థాపక అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ పేరు నమోదు చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు వయస్సు 36 సంవత్సరాలు కాగా బీహార్ లోని గయ నుంచి ఎన్నికైన జితన్‌రామ్ మాంఝీ వయస్సు 79 ఏళ్లు. మాంఝీ గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశా రు. కాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగత్ ప్రకాశ్ నడ్డాను తాజా క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఐదేళ్ల విరామం తరువాత జేపీ నడ్డా తిరిగి కేంద్ర మంత్రిమండలిలో చేరారు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లకు కూడా కేంద్ర క్యాబినెట్‌లో చోటు దొరికింది.అలాగే ఎన్డీయే భాగస్వామ్యపక్షాల తరఫున జనతాదళ్ సెక్యులర్ హెచ్‌డీ దేవెగౌడ, లోక్‌జనశక్తి పార్టీ తరఫున చిరాగ్ పాశ్వాన్, హెచ్‌ఏఏం – సెక్యులర్ పార్టీ తరఫున జితన్ రామ్ మాంఝీ, జేడీ యూ – లలన్ వర్గం తరఫున లలన్ సింగ్ లకు కూడా కేంద్ర మంత్రిమండలిలో పదవులు దక్కాయి.
నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువుదీరిన తాజా కేంద్ర క్యాబినెట్‌ను పాత, కొత్తల మేలు కలయికగా పేర్కొనవచ్చు. మొత్తంగా 71 మందితో కొలువుదీరిన క్యాబినెట్‌లో పాత వారు 35 మంది ఉండగా కొత్త వారు 36 మంది ఉన్నారు. కాగా మొత్తం మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు పదవులు దక్కాయి. వీరిలో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు కాగా ఐదుగురు సహాయ మంత్రులు. క్యాబినెట్ మంత్రుల్లో గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖా మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఆమెతో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్దాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బాంభణియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ ఉన్నారు. వీరిలో అన్నపూర్ణాదేవికి క్యాబినెట్ హోదా లభించింది. మిగిలినవారికి సహాయమంత్రి హోదా లభించింది. 30 మంది క్యాబినెట్ మంత్రుల్లో పాతికమంది లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు. ఐదుగురు క్యాబినెట్ మంత్రులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీల సంఖ్య తగ్గింది. దీంతో క్యాబినెట్‌లోనూ ఉత్తరప్రదేశ్ కోటాకు కోత పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం ఇద్దరికే క్యాబినెట్‌లో చోటు లభించింది. వీరిలో ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ కాగా మరొకరు రాజ్‌నాథ్ సింగ్. మంత్రివర్గంలోకి పది మంది కొత్తవారు చేరారు. ఇందులో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు కావడం విశేషం.
ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార వేడుకకు ఏడు దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధాని పుష్ఫ కమల్ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే, మారిషస్ ప్రధాని ప్రవిండ్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ అధ్యక్షు రాలు షేక్ హసీనా, సీ షెల్స్ ఉపాధ్య క్షుడు అహ్మత్ అఫీఫ్ ఉన్నారు. వీరి రాకతో భవిష్యత్తులో ఆయా దేశాలతో మనదేశ సంబంధాలు భవిష్యత్తులో బలపడతాయని విదేశాంగ వ్యవహారాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకార వేడుకకు విపక్షం గైర్హాజరైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే. రాజ్యసభ విపక్ష నేత హోదాలో హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాము హాజరయ్యేది లేదని తృణమూల్ కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది.


