తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తగా విరాజిల్లుతున్న ప్రముఖ ప్రవచనకర్త.. చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా ఆయనను నియమించింది. కేబినెట్ ర్యాంక్ తో కూడిన ఈ పదవి అత్యంత కీలకమైనది. చాగంటి వారికి ఈ గౌరవం తగినది కూడా. ఆయన బోధించే బోధనలు నైతిక నిష్ట వంటివి ఈ తరానికి పాఠాలుగా చేరాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆయనను కోరి మరీ ఈ పదవికి ఎంపిక చేసింది.
గత పదిహేనేళ్లలో చాగంటి వారు సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. తనకు ఉన్న విజ్ఞాన సంపదను ప్రజలకు అందించేందుకు ఆయన దశాబ్దాలుగా చేస్తున్న కృషి నిరుపమానం. ఆయన విద్వత్తు ఎన్నతగినది, ఆయన ప్రసంగాలు పండిత పామరులను సమానంగా రంజింపచేస్తాయి. చాగంటి వారికి కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి దక్కిన నేపథ్యంలో ఆయన గురించి చాలామందికి తెలియని కొన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం..
చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేశారు. ఆయన సతీమణి వ్యవసాయశాఖలో ఉన్నతాధికారి. చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో.. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.
ప్రవచనాలు చెప్తునందుకు చాగంటి వారు నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా టూవీలర్ మీదే వెళ్తారు చాగంటి.
చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. అయినా అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా చాగంటి వారు విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.
చాగంటి వారు కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు. ఆయన ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.