స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హబ్సీగూడ చౌరస్తా సమీపంలో ఉన్న ఓ భవనంలోని 2, 3 అంతస్థుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అంతస్తుల్లో ఉన్న రెస్టారెంట్ లో మొదటగా అగ్నిప్రమాదం సంభవించగా.. అది అన్ లిమిటెడ్ షాపింగ్ మాల్ కు కూడా వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అర్పుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఆ భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అన్ లిమిటెడ్ షాపింగ్ మార్ కింద రెమండ్, జాకీ షో రూములు కూడా ఉన్నాయి. ఇవి కూడా బట్టల దుకాణాలు కావాడంతో మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
అగ్నిప్రమాదంతో స్థానికంగా పొగ కమ్మేసింది. ఉప్పుల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ప్రయాణికులు పొగతో ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా నివాసం ఉండేవారు కూడా పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిప్రమాదంతో ఉప్పల్ సికింద్రాబాద్ మార్గంలో హబ్సీగూడ చౌరస్తా వద్ద కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు అన్ లిమిటెడ్ షాపింగ్ మాల్ కు దగ్గరలోని పెట్రోల్ బంక్ ఉంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది అత్యంత జాగ్రత్త మంటలు అర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.