స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు అంతే లేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో బాధితులను వెంటాడుతూనే ఉన్నారు. డబ్బులు తిరిగిచ్చినా.. ఇంకా ఇంకా కట్టాలంటూ పీక్కుతింటున్నారు. లేదంటే న్యూడ్ ఫోటోలు బంధువుల అందరికీ పంపుతామంటూ అసభ్యకర సందేశాలతో మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులు భరించలేక ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే ఏపీలోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
బాపట్లకు చెందిన సాయి అనే యువకుడు రెండు సంవత్సరాల క్రితం లోన్ యాప్స్ నుంచి రూ.50వేలు రుణం తీసుకున్నాడు. అనంతరం రూ.40వేల వరకు తిరిగి కట్టాడు. అయినా కానీ ఇంకా రూ.50 వేలు కట్టాలని నిర్వాహకులు వేధించసాగారు. ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని.. కొంత సమయం ఇస్తే కడతానని వేడుకున్నాడు. అయితే వారు మాత్రం వెంటనే డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు ఎడిట్ చేసి వైరల్ చేస్తామని బెదిరించారు.
ఇలా రెండేళ్ల నుంచి మానసికంగా వేధిస్తుండటంతో ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.