సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ శాంతినికేతన్ కాలనీ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. పెద్ద చెట్టు విరిగిపడడంతో ఒక్కసారిగా వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదే సమయంలో ఎవరూ అటు వైపుకు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఈ ఘటన ఓల్డ్ బోయిన్ పల్లి పాత కళ్యాణ్ థియేటర్ ప్రాంతంలో జరిగింది. రహదారిపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగిపడింది. చెట్టుపడిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డివిజన్ పరిధిలో చాలా చోట్ల ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయని.. వాటిని గుర్తించి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.