కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో లబ్ధిదారులు రోడ్డెక్కారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాత్సారం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని దళిత బంధు సాధన సమితి నాయకులు ఆరోపించారు. దళితుల ఓట్ల కోసమే అప్పటి అధికారులతో బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించి దళిత బంధును నిలిపివేశారని అన్నారు. కౌశిక్ రెడ్డి దళిత ద్రోహి అని, ఆయనను నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా దళిత బంధు రెండో విడత నిధులను మంజూరు చేయాలని కోరారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి కేసీ క్యాంప్‌లోని ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.