కృష్ణా, గోదావరి నది జలాలపై హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలను టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఖండించారు. హరీష్ రావు, కేటీఆర్ రోజుకో సమస్యతో మీడియా ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. లేని జల జగడాలన్ని తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో జగన్‌కి, ఇటు రాజకీయంగా ఉపయోగపడే అంశాలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు.
“ఇప్పటికీ మిగులు జలాలు, ఉభయ నదుల మీద చర్చ జరుగుతూనే ఉంది. పోలవరం నుండి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా CWC నుండి అపెక్స్ కౌన్సిల్ నుండి ఉత్తర్వులు రాలేదు. ఇటీవలె ఢిల్లీలో గోదావరి, కృష్ణా ,రివర్ బోర్డు సమావేశాలు జరిగాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. మీ హాయంలో పోతిరెడ్డి పాడు, రాయలసీమ ప్రాజెక్టులు చేపడితే నోరు మెదపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీలాగా కాదు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నారనేది వాస్తవం. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. అసత్యాలు, గ్లోబల్ ప్రచారం మానుకోండి. కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపుతో ఉంది”… అని అద్దంకి దయాకర్ అన్నారు.