తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధు తిరుమలకు వచ్చినప్పుడు రీల్స్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. శ్రీవారి ఆలయం, పుష్కరిణి వద్ద రీల్స్, ఫొటోషూట్ చేయడం పట్ల టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది టీటీడీ నిబంధనలు, ఆలయ సంస్కృతిని ఉల్లంఘించడమేనని, తమ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంటూ సహజీవనం చేస్తున్నామని చెప్పడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అభిప్రాయపడింది. దీంతో ఆమెపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీటీడీ ఏవీఎస్‌వో ఎం.మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దివ్వల మాధురిపై తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల మాడవీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. అక్కడ పవిత్రమైన శ్రీవారికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలని.. వ్యక్తిగత విషయాలను మాట్లాడటం నిషేధమని పేర్కొన్నారు. ఎవీఎస్‌వో మనోహర్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.