స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బాధాతప్త హృదయంలో కూడా ఆ పిల్లడు ఆలోచించిన తీరు అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేస్తుంది. ఇంట్లో జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని తొమ్మిదేళ్ల బాలుడు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తీరు అందరి చేత మన్ననలు పొందుతుంది. పోలీస్ స్టేషన్ అంటే.. అందరూ బయపడుతుంటే.. ఆ పిల్లడు మాత్రం తనకు న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ కు 9 ఏళ్ల బాలుడు కన్నతండ్రిపై ఎస్ఐ శివయ్యకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రోజు తాగొచ్చి తన తల్లిని, తనను కొడుతున్నాడని.. మీరే న్యాయం చేయాలని ఎస్ఐకి చెప్పాడు.
దీంతో ఆశ్చర్యానికి గురైన ఎస్ఐ.. మరిన్ని ప్రశ్నలను ఆ బాలుడిని అడిగాడు. దీంతో గుక్కతిప్పుకోకుండా ఎస్ఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. దీంతో ఎస్ఐ వెంటనే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. ధైర్యసాహసాలు కలిగిన బాలుడు గురించి కర్లపాలెం మండలంలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.