31.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

65 ఏళ్ల భర్తను సాహసోపేతంగా కాపాడిన 55 ఏళ్ల భార్య

పెళ్లి, పరిణయం, వివాహం, శాదీ, మ్యేరేజ్… ఏ భాషలో అయినా వీటి అర్థం ఇద్దరు ఒకటవ్వడం. ఆ ఇద్దరులో ఒకరు స్త్రీ, మరొకరు పురుషుడు. ఎవరి పద్ధతులు, ఎవరి సంప్రదాయాల ప్రకారం వారి వారి వివాహాలు జరుగుతాయి. ఇది సాధారణంగా జరిగే తంతు. అయితే, అసాధారణ రీతిలో జరిగే పెళ్లిళ్లు, తంతులు వేరేలా ఉండవచ్చు, అది వేరేవిషయం. అయితే, పెళ్లినాడు..జీవితాంతం కలిసి ఉంటామని పెళ్లి పెద్దలు వధూవరులతో ప్రమాణాలు చేయిస్తారు. హైందవ సంప్రదాయంలో అయితే…ధర్మేచ , అర్థేచ , కామేచ, నాతి చరామి అని ప్రమాణాలు చేయిస్తారు. భావి జీవితంలో ప్రతి విషయంలో తాము చేపట్టబోయే ప్రతి విషయంలో కలిసి అడుగులు వేస్తామని.. ఒకరిని ఒకరు కంటికి రెప్పలా చూసుకుంటామని దీని అర్థంగా పెద్దలు చెబుతున్నారు. ఇక పెళ్లయ్యాక.. ఏడడుగులు నడిచాం, ఏడేడు జన్మలు తోడుగా ఉందామని, ఒకరి నగుమోము ఒకరు కడదాకా కనులారా చూసుకోవాలని, ఉపచారాలు, అపచారాల్లో..ఎవరిది తప్పయినా, ఒప్పయినా.. ఇరువురు ముందుకు సాగాలని ప్రమాణాలు చేసుకుంటారు. అపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, బాధ్యతల్లో.. ఎల్లవేళలా ఒకరి కొకరు తోడుగా ఉందామని ప్రమాణాలు చేసుకుంటారు. అయితే, ప్రస్తుత సమాజంలో చాలామంది ఈ పెళ్లినాటి ప్రమాణాలను గాలికి ఒదిలేస్తున్నారు.

పాలు, నీళ్లల్లా కలిసి ఉండే భార్య, భర్తల ఆప్యాయతానుబంధాలు మాటల్లో చెప్పేవి కావు. అయితే, కొందరు.. తమలాంటి ఆదర్శనీయ దంపతులు లోకంలోనే ఉండరని లెక్చర్లు దంచేసిన భార్యాభర్తలు.. ఇలా ఇంటికెళ్లగానే..కారాలు మిరియాలు నూరుకోవడం జరుగుతూంటుంది. కొన్ని సందర్బాల్లో కక్షలు, కార్పణ్యాలు ఒకళ్ల మీద ఒకళ్లు పగతీర్చుకునే స్థాయికి, ప్రాణాలు తీసేస్థాయికి వెళ్లవచ్చు. కొందరు ఏ సందర్భంలోనూ తేడా లేకుండా, ఒకరికోకరు వీర విధేయులుగా ఉంటారు. ఎవరికైనా ఆకస్మిక ఆపద సంభవించినప్పుడు ఎవరో వ్యక్తో, వ్యక్తులో ఆపద్భాంధవుల్లా వచ్చి కాపాడడం జరుగుతుంది. లేదంటే భార్యభర్తల్లో ఒకరికి ఆపద వాటిల్లినప్పుడు మరొకరు ఆదుకోవడం జరుగుతుంది.

పురుషాధిక్య ప్రపంచంలో.. భర్త, భార్యని కాపాడిన సందర్భాలు ప్రముఖంగాను, భార్య, భర్తను రక్షించిన సందర్భాలు అంతంత మాత్రంగా వెల్లడించడం జరుగుతుంది. అయితే, ఈ కాపాడడం, రక్షించడం అనేవి ఎంతవరకు అంటే..తమ ప్రాణాల మీదకు రానంతవరకు అనే చెప్పవచ్చు. బహుకొద్ది మందే తమ ప్రాణాలు పణంగా పెట్టి పరుల ప్రాణాలు కాపాడే వారు ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో నేర్పు, సమయస్ఫూర్తితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏ నదిలోనో, సముద్రంలోనో ఎవరైనా మునిగి పోబోతుంటే…గజ ఈతగాడైనా ఎంతో మెళుకువతో ఆ వ్యక్తిని కాపాడాల్సి ఉంటుంది. లేదంటే.. కొన ఊపిరికి చేరుకున్న వ్యక్తి ఆదుర్దాలో.. ఈ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటే..ఇరువురికి ప్రమాదం వాటిల్లవచ్చు. పెనిమిటి తీవ్ర ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు..నేర్పుగా, ఎంతో ఓర్పుగా ఓ యాభై అయిదేళ్ల గృహిణి.. తన అరవై అయిదేళ్ల భర్తను విజయవంతంగా కాపాడి.. అందరి ప్రశంసలకు పాత్రురాలైంది.

కేరళ.. హయ్యస్ట్ లిటరసీ స్టేట్ గా.. ఇంటిలిజెన్స్ లో టాప్ గా ప్రత్యేకించి ఉమెన్ టాప్ ఇంటిలిజెన్స్ స్టేట్ గా పేరుపొందింది. ఇంటిలిజెన్స్, ఇండస్ట్రీతో పాటు డేరింగ్ లోను, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడ్డంలోను మహిళలు ఏం తక్కువ కాదని ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ధీర గృహిణి రుజువు చేసింది. రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా పిరవమ్ పట్టణంలో రమేశన్ అనే వృద్ధుడు … తన ఇంటి పెరట్లో మిరియాల చెట్టు ఎక్కి మిరియాలను సేకరిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ చెట్టుకొమ్మ విరిగిపోయింది. అయితే, ఆ చెట్టు కిందే 40 అడగుల పెద్ద బావి ఉంది. ఆ కొమ్మతో సహా రమేశన్ చేద బావిలో పడిపోయాడు. దీన్ని గమనించిన.. ఆయన భార్య పద్మ.. భర్తను కాపాడడానికి వెంటనే ఉద్యుక్తురాలైంది.

ఏడుపులు, పెడబొబ్బలు పెడుతూ.. వాళ్ల కోసం, వీళ్ల కోసం ఆమె ఎదురు చూపులు చూడలేదు. ఎంతో సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రదర్శించి ఓ తాడు సాయంతో బావిలోకి దిగిపోయింది. అపస్మారక స్థితిలోకి చేరుతున్న భర్తను చేతుల్లోకి తీసుకుని ప్రథమ చికిత్స అందించింది. అప్పుడు గట్టిగా కేకలు వేసింది. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న భర్తను కాపాడుతూ దాదాపు 20 నిమిషాలసేపు బావి నీటిలోనే ఉంది. ఒకవైపు భర్త నీటిలో మునిగిపోకుండా, తాను నీటి బారిన పడకుండా.. ఆమె ఆ 20 నిమిషాలపాటు ఎదుర్కొన్న కష్టం తల్చుకుంటే.. ఎవరికైనా గగుర్పాటు కలుగుతుంది. పద్మ కేకలు విని పరుగున వచ్చిన స్థానికులు ఈ సమాచారం సహాయక సిబ్బందికి చేర్చారు. సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్షలికి చేరుకుని వృద్ధ దంపతులను కాపాడారు.
సహాయక దళాలు బావి నుంచి రమేశన్, పద్మ దంపతులను బయటకు తీస్తున్నదృశ్యాలను కేరళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. అనంతరం ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అంతటా ఈ వార్త వ్యాపించింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియాలో మహిళ తెగువను నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. వివాహబంధానికి ఉన్న శక్తిని ఈ సాహసం చాటి చెబుతోందని కొందరు పోస్టులు పెడుతున్నారు.

Latest Articles

JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాలు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఈ రోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ) మెయిన్ 2025 సెషన్ 1 కోసం స్కోర్‌కార్డులను విడుదల చేసింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఫలితాలను యాక్సెస్ చేయడానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్