YS Viveka Murder case | వైఎస్ వివేకా హత్య కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ బాస్కరరెడ్డి, మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీపై సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. సోమవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది సీబీఐ కోర్టు. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపిన సీబీఐ.. మరిన్ని వివరాలను సేకరించేందుకు కస్టడీకి ఇవ్వాలని.. సీబీఐ కోర్టులో వాదనలు వినిపించింది. అయితే సీబీఐ తరఫు వాదనలను నిందితుల తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. సీబీఐ కొందరినే లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేపడుతుందని వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాదులు విడివిడిగా తమ అభ్యర్థనను వినిపించారు. ఇష్టం వచ్చినవారిని మాత్రమే సీబీఐ అరెస్టు చేస్తోందని.. మళ్ళీ ఇంకెవరిని అరెస్టు చేస్తుందోనని ఆందోళనగా ఉందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తుది జడ్జిమెంట్ ను ఇవాళ్టికి వాయిదా వేసింది. నేడు ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న తర్వాత తుది తీర్పు వెలువడనుంది.