Minister KTR | భాగ్యనగరవాసుల కష్టాలను తీర్చేందుకు ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్ లను అధికార బీఆర్ఎస్ నిర్మించింది. దీంతో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుండి కాస్త ఉపశమనం కలిగించింది. తాజాగా, నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు సిద్ధమైంది. నేడు ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్‌బీ నగర్ చౌరస్తా కు నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌కు ‘మాల్ మైసమ్మ’ అని నామకరణం చేశారు.
ఎస్ఆర్‌డీపీ కింద ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో రూ. 650 కోట్లతో మొత్తం 12 పనులను చేపట్టామని మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ 9వ ప్రాజెక్టు అని.. ఇంకా మూడు ప్రాజెక్టులు మిగిలి ఉన్నాయని తెలిపారు. బైరామల్‌గూడలో సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, రెండు లూప్‌లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఈ పనులను పూర్తి చేసిన తర్వాతే.. ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు.
ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ ను చింతలకుంట నుంచి మాల్ మైసమ్మ వరకు నిర్మించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు రూ.32 కోట్ల వ్యయంతో మూడు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడంతో ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: చేపల దుకాణాలు మూసివేసినట్లేనా? జగన్ రెడ్డి: లోకేశ్
Follow us on: Youtube Instagram