అల్లరి నరేష్‌కు ‘నాంది’ సినిమా ఒక టర్నింగ్ మూవీగా నిలిచింది. అప్పటి వరకూ కమెడియన్ నరేష్ గానే అలరించిన ఆయనలో మరో కోణాన్ని ‘నాంది’ సినిమా బయటపెట్టింది. ఆ సినిమా తర్వాత నరేష్ ఎంచుకునే సినిమాలు వైవిధ్యంగా ఉంటున్నాయి. నరేష్ తాజా చిత్రం టైటిల్ టీజర్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ‘బచ్చలమల్లిగా’ ఫెయిల్ అయిన నరేష్.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సాలిడ్ స్క్రిప్ట్ ఉన్న కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. కథ, కథనంలో ఉన్న బలాన్ని నమ్మే కొత్త డైరెక్టర్‌కు నరేష్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. పలు మీడియా సంస్థల్లో పని చేసిన నాని కాసరగడ్డ అనే కొత్త కుర్రాడికి అల్లరి నరేష్ తన తాజా చిత్రానికి దర్శకుడిగా అవకాశం కల్పించారు. అదే ‘12 ఏ రైల్వే కాలనీ’. తాజాగా ఈ చిత్రం టైటిల్ టీజర్ విడుదలైంది. ఆత్మలు, అతీంద్రీయ శక్తులు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి? అవి అందరికీ ఎందుకు కనిపించవు? అనే ఆసక్తికర ప్రశ్నను డైరెక్టర్ నాని ఈ చిత్రంలో చర్చించబోతున్నట్లు టైటిల్ టీజర్ ద్వారా తెలుస్తోంది. అల్లరి నరేశ్ భిన్న కోణాల్లో కనిపించే పాత్రని పోషించినట్టు టీజర్ స్పష్టం చేస్తోంది.
అల్లరి నరేశ్, డా.కామాక్షి భాస్కర్ల, సాయికుమార్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ నాని కాసరగడ్డ ఎడిటర్‌గా కూడా పని చేస్తున్నారు. ‘పొలిమేర’ సినిమాల ఫేమ్ డా.అనిల్ విశ్వనాథ్ కథ, కథనం, సంభాషణలు అందించడంతోపాటు, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గెటప్ శ్రీను, సద్దాం, జీవన్‌కుమార్, గగన్ విహారి, అనిశ్ కురువిల్లా, మధుమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.