ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసింది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం కాగా.. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది.
మొత్తం 18,180 మందికి రూ.6 వేల చొప్పున జమ చేసింది. ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల జమ ఆగిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేశారు.
ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించింది ప్రభుత్వం. 66,240 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ అయినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.65 కోట్లు చెల్లించింది.
ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్దదిక్కుగా నిలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్దిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఒక సీజన్ కు రూ. 6000 చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తుంది. డిబిటి పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.