వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేయడంపై మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో ఫైర్ అయ్యారు. వైసిపి ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను చదివి వినిపించారు. సభలో వున్న మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి బై పదో శాతం మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీకి వుండాలని చెప్పారు. అలా ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అని నిబంధనలు చెబుతున్నాయని అన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదని విరుచుకుపడ్డారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను లాగితే చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా వుండదని చెప్పారన్న విషయాన్ని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఉభయ సభల సభ్యులనుద్దేశించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని పట్టుబట్టారు. గవర్నర్ ప్రసంగం సాగుతుండగా, వెల్‌లోకి వెళ్లి మరీ నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. ప్రజాపక్షం..ప్రతిపక్షం.. అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. ప్రతిపక్షాన్ని గుర్తించండి, హోదా ఇవ్వండి.. అంటూ నినాదాలు చేశారు. మంగళవారం మండలిలో మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష హోదా రావాలంటే ఎంత మంది సభ్యులు ఉండాలనే విషయాన్ని వివరించారు.
మరోవైపు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదాని సూటిగా చెప్పేశారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని సూచించారు.