తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఉన్న MRPపై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. చివరిసారిగా మూడేళ్ల క్రితం ధరలు పెరిగాయి. అయితే రెండేళ్లకోసారి ధరలను పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది. గత ఏడాది కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీ వేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ దీనిపై అధ్యయనం చేసింది.
గతంతో పోలిస్తే పెరిగిన ముడిసరుకుల ధరలు, ఉత్పత్తిదారుల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలను అధ్యయనం చేసిన కమిటీ.. ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రస్తుత ధరలపై 15 శాతం పెంచవచ్చని కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. కొత్త ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని ఎక్పైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.