దశాబ్దకాలంగా ఆప్, తమరు, సార్ అంటూ కేజ్రీవాల్ ప్రభుత్వంపై న్యూఢిల్లీవాసులు క్రేజీ ప్రదర్శించారు. నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీపై చీపురు తిరగేశారు. అవినీతిని, అన్యాయాలను, అక్రమాలను ఊడ్చిపారేస్తానని చీపురు గుర్తుతో ఎన్నికల్లో ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్యామ్యాంలు, ముడుపులు, ఖర్చులు.. వగైరా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంతో..ఈ పార్టీకి మూలకూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది. ఢిల్లీ ప్రజల ఆత్మీయత, అభిమానాన్ని కేజ్రీవాల్ కోల్పోయారని న్యూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్లింది. గత ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆప్ కి ఈ దుస్థితి రావడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే.. ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. రెండు టెర్మ్ లలో మంచి పనితీరే కనపర్చింది. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ విషయంలో ప్రజల మెప్పు పొందింది. విద్యుత్, వాటర్ సబ్సిడీలు ఓటర్లను ఆకర్షించాయి. నాడు అఖండ మెజార్టీతో ఆప్‌నకు అధికారాన్ని కట్టబట్టారు.
రెండో టెర్మ్ పూర్తయ్యాక ఆప్ వైభవం క్షీణించడం మొదలెట్టింది. దేశ రాజధానిలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. కేంద్రంలో జైజాంటిక్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. సామంత మాదిరి రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు ఎంత జాగురూకతతో వ్యవహరించాలి. ఎంత గొప్పగా ప్రజాభిమానాన్ని సాధించాలి. అయితే, కేంద్రంలో ఉన్న పార్టీతో చీటికి మాటికీ తగాదాలు పెట్టుకుంటే.. ప్రయోజనం ఏమిటని ఆమ్ ఆద్మీ ఆలోచించలేకపోయిందని వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కల్గించేలా కేంద్రం చర్యలు ఉంటే.. తప్పక విబేధించాలి, నిలదీయాలి, రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి వైరమన్నా ప్రదర్శించవచ్చు.. లేదంటే..తమ ప్రజల సమస్యలు వివరించి, సామరస్యపూర్వకంగా సాధించే ఫలితాలను సాధించవచ్చు.
మూడో టెర్మ్ వచ్చేసరికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆప్ వెనకబడింది. ఎయిర్ క్వాలిటీ సమస్యను అధిగమించడంలో రాష్ట్ర సర్కారు ఫెయిలైంది. ఇది అక్కడి ప్రజలను తీవ్రంగా నిరాశ పర్చింది. తమ విధులకు కేంద్ర బీజేపీ సర్కారు ఆటంకం కల్గిస్తోందని ఆప్ సర్కార్ కేంద్రం పై విరుచుకుపడింది. దశాబ్దకాలం ఆప్ పాలనలో మంచి పనులు ఉన్నా, కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే, విపక్షాలు ఆప్ పై చేసిన విమర్శలను ప్రజలు చూసీ చూడనట్టు వదిలేశారు. ఆప్ వైఖరిలో మెల్ల మెల్లగా వస్తున్న మొండి వైఖరి, కేంద్రంలో ఉన్న బీజేపీ ఇచ్చిన డబుల్ ఇంజన్ సర్కార్ వాగ్దానం ప్రజలను ఆలోచించేలా చేసింది.ఇదే ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో .. ఆప్ పరాజయానికి, బీజేపీ విజయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణల్లో తెలియజేస్తున్నారు.
అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రతికూలత ఉన్నా…కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..కేంద్ర బీజేపీ సర్కారు తన హవా చాటుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ వైపు దిగ్గజ పార్టీతో పోరు సల్పాల్సిన అవసరం ఉందో, మరో వైపు తిరుగమన దశలోనే ఉన్నా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఏమైనా కాస్త తలెత్తుతుందేమో దాన్ని చూసుకోవాల్సి ఉంది, ప్రజలతో మరింత మమేకమై.. ప్రజాభిమానానికి విఘాతం లేకుండా, ప్రజలను దూరం చేసుకోకుండా… వారి అభీష్టానికి సంపూర్ణంగా అనుగుణంగా వెళితే.. హ్యాట్రిక్ విజయం సాధించాలనే పట్టుదలతో.. విశేషంగా శ్రమించి ఉంటే.. ఫలితాలు ఎలా ఉండేవో. అయితే, శీష్ మహల్ పై కనబర్చిన కేజ్రీవాల్ కనబర్చిన క్రేజీ బీజేపీ నేతలకు ఎన్నికల అస్త్రంగా లభించింది. శీష్‌మహల్ కోసం ఆప్ పెట్టిన ఖర్చును చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయిన సాక్షాత్ ప్రధాని మోదీయే విమర్శించడంతో.. ప్రజల్లో ఆప్ కు బ్రేక్ వేయాలని, కమలం పార్టీని అక్కున చేర్చుకోవాలని ఆలోచనలు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్పులు, చేర్పులకు పెద్ద ఎత్తున ఖర్చు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీన్ని బీజేపీ నేతలు ప్రధానంగా టార్గెట్ చేశారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాణాలు సంధించారు. కాగ్ నివేదిక ప్రకారం.. శీష్ మహల్ పునర్నిర్మాణానికి ప్రాథమిక అంచనా 7.91 కోట్ల రూపాయలుగా ఉంది. 2020 లో పనులు ప్రారంభించినప్పుడు ఇది 8.62 కోట్ల రూపాయలకు వరకు పెరిగింది. అయితే, 2022 లో ప్రజా పనుల విభాగం నిర్మాణం పూర్తి చేసే సమయానికి ఈ ఖర్చు 33.66 కోట్ రూపాయలకు పెరిగింది. బీజేపీ శీష్ మహల్ ఆరోపణలను ఆప్ తిప్పికొట్టడానికి రాజ్ మహల్ ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సంపన్న జీవనశైలి.. అంటూ ఆప్ చేసిన ఆరోపణలను ఢిల్లీ ప్రజలు పట్టించుకోలేదని ప్రస్తుత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.
ఆప్ ప్రభుత్వం చివరి ఐదేళ్ల పాలనలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య లిక్కర్ పాలసీ. కొత్త పాలసీ తీసుకువచ్చిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని తాగుబోతుల నగరంగా మార్చిందని బిజెపి ఆరోపించింది. మద్యం విధానంలో ఇటువంటి ఆరోపణలను ఆప్ ఖండిస్తూ వచ్చింది. తర్వాత కొత్త పాలసీని ఆప్ రద్దు చేసుకుంది. సెంట్రల్ ఏజెన్సీల దర్యాప్తుతో ఆప్‌కు చెందిన అగ్ర నాయకులను అరెస్టు చేశారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టయిన వారిలో ఉన్నారు. సిసోడియాను అరెస్టు చేశాక, ఆయన డిప్యూటీ సీఎం పదవినీ కోల్పోయారు. అనంతరం ఆప్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరించారు. అయితే, సీఎం కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అయిదు నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు. ఇంతమంది అగ్ర నాయకుల అరెస్టులు ఆప్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రజలకు 2020 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనకబడింది. లిక్కర్ పాలసీ వల్ల పార్టీకి జరిగిన డ్యామేజ్‌ను సరిచేసుకోవడంతోనే కాలం అంతా గడిచిపోయింది. ఏదేమైనా.. ఆప్ పార్టీకి కష్టాలన్నీ కట్టకట్టుకోచ్చాయి, చేసిన తప్పిదాలు చెడని పదార్థాలుగా మారి ఆప్ మెడకు చుట్టుకున్నాయి. ఇంతవరకు జైళ్లలో రెస్ట్, ఇప్పుడు ఇళ్లలో రెస్ట్ అంటూ.. ఆప్ పార్టీపై నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ కు షాక్ తగలగా.. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మరో అగ్రనేత మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు. కేజ్రీవాల్ పై ప్రజల క్రేజీ తగ్గించేసి ఆయనను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించేశారు. కేజ్రీ పరాజయం ఎంతలా ఉంది అంటే .. రెండు రౌండ్లు మినహా చివరి వరకు ఆయన వెనుకంజలోనే ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఆరంభం అయినప్పటి నుంచి కేజ్రీవాల్ కు ఎదురుగాలే వీచింది. ఇక మరో ఆప్ ప్రముఖ నేత మనీశ్ సిసోడియాను జంగ్‌పురాలో బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ 600కు పైగా ఓట్ల తేడాతో ఓడించి పారేశారు. అయితే, ఢిల్లీ సీఎం ఆతిశీ గెలుపు ఆప్ పార్టీకి కొంత ఊరట ఇచ్చింది. ఎట్టకేలకు కల్కాజీ నియోజకవర్గంలో ఆమె గట్టెక్కారు. రమేశ్ బిధూరిని ఓడించి ఆమె పార్టీ పరువు కొంత నిలబెట్టారు. అయితే, చివరి వరకు వెనుకంజలోనే ఉన్న ఆమె లాస్ట్ రౌండ్ లో బెస్ట్ గా మారి విజయం పొందారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యాన్ని గమనిస్తే…2011లో ఢిల్లీ కేంద్రంగా అన్నా హజారే.. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. హజారే పోరాటం అనంతరం 2012లో ఆయన అనుచరవర్గానికి చెందిన అరవింద్ కేజ్రీవాల్, మరికొందరు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చింది. పదేళ్లకు పైగా ఢిల్లీలో ఈ పార్టీ అధికారంలో కొనసాగింది. అయితే కేజ్రీవాల్ రాజకీయాల్లో చేరడాన్ని అన్నా హజారే నిరసించారు, తిరస్కరించారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో హజారే స్వయంగా వెల్లడించారు. రాజకీయాలు వద్దని, నిజమైన నెరవేర్పు సామాజిక సేవలోనే ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ కు పలుమార్లు చెప్పినా, తన మాటను కేజ్రీవాల్ బేఖాతారు చేశారని హజారే చెప్పారు. ఈ ఎన్నికల ముందు అన్నా హజారే ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో…స్వచ్ఛమైన వ్యక్తిత్వం, ఆలోచనలు ఉన్నవారికి, దేశం కోసం త్యాగం చేయగల వారికి, అవమానాన్ని జీర్ణించుకోగల వారికి ఓటు వేయాలని ఆ సందేశంలో తెలిపారు.
ఒకటి కాదు, రెండు కాదు రెండున్నర దశాబ్దాల మీద రెండేళ్ల అనంతరం బీజేపీ బంపర్ మెజార్టీతో హస్తినను హస్తగతం చేసుకుని ఢిల్లీ బాద్ షా అయ్యింది. ఇంత గొప్ప విజయం, ఇన్నేళ్ల తరువాత సాధించాక.. కమలనాధుల ఆనందానికి అవధులు ఉంటాయా..? అందుకే బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి..అంబరాన్నంటేలా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు.
————-