దేశ ప్రజలకు రిజర్వు బ్యాంక్ ఒక శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను సవరించింది. ప్రధానంగా రెపో రేటును 0.25 శాతం మేర రిజర్వు బ్యాంకు తగ్గించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి పరపతి విధాన సమీక్ష ఇదే. ఈ సందర్భంగా వడ్డీ రేట్లను తగ్గించిన విషయాన్ని ఆయన తెలియచేశారు. కాగా వడ్డీ రేట్లను ఆర్ బీ ఐ తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే అనేకానేక కారణాలతో ఈ విషయమై నిర్ణయం తీసుకోవడంలో ఆర్బీఐ జాప్యం చేసింది. ఎట్టకేలకు కీలక వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంకు సవరించింది.
రిజర్వు బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగి వచ్చింది. దాదాపు ఐదేళ్ల తరువాత రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఇదిలా ఉంటే, కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించడం రెండేళ్ల తరువాత ఇదే కావడం విశేషం.
కోవిడ్ నేపథ్యంలో 2020 మే నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర రిజర్వు బ్యాంక్ తగ్గించింది. ఆ తరువాతి కాలంలో వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించింది. అయితే 2023 మే నెల నుంచి కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ వచ్చింది రిజర్వు బ్యాంకు. కాగా కీలక వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇంటి అలాగే వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు ఆర్థికవేత్తలు.
కాగా దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అనేక కీలక అంశాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చు అన్నారు. అలాగే ఆహార ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశాలున్నాయన్నారు. కమర్షియల్ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రస్తావించారు. కమర్షియల్ బ్యాంకుల దగ్గర సరిపడ ద్రవ్య లభ్యత ఉందన్నారు. అంతేకాదు సదరు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే, మెరుగ్గా ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా.