బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29న రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో కేటీఆర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్‌లు వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై న్యాయవాదులతో చర్చించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారు. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10న విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు.