తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. అడవిని వదిలి జనావాసాల్లోకి చిరుతలు తరచూ రావడం భయాందోళనకు గురి చేస్తోంది. మనుషులు, మూగజీవాలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. చిరుతల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాంటేనే జంకుతున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణలో చిరుతల సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కన్నాల గ్రామంలోని బుగ్గ రాజరాజేశ్వర ఆలయం సమీపంలో పెద్దపులి సంచరిస్తోంది. అటవీ శాఖ అధికారులు పులి అడుగులు గుర్తించారు. దీందో స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత మూడు నెలలుగా కొమురం భీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు, అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కాగజ్ నగర్ సమీప గ్రామంలో.. పొలంలో పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళపై దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన మరువక ముందే సిర్పూర్ మండలంలో సురేష్ అని రైతుపై దాడి చేసి గాయపరిచింది. పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్న కొద్ది రోజులకే… మంచిర్యాల జిల్లాలో మళ్ళీ పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తుంది.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో చిరుతపులి హల్‌చల్ చేసింది. ఠాణాకలాన్ గ్రామశివారులో రెండు రోజుల క్రితం కనిపించిన చిరుత మళ్లీ హల్‌చల్ చేసింది. జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చి అలజడి సృష్టించింది. ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చిన చిరుతను చూసి సెక్యూరిటీ గార్డు భయభ్రాంతులకు గురైన సెక్యూరిటీ రూంలోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. చిరుత ఓ శునకాన్ని నోట కరుచుకొని వెళ్లిపోయినట్లు సిబ్బంది తెలిపారు.
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. క్యాంపస్ ఆవరణలో చిరుత.. కుక్కను వేటాడి ఎత్తుకెళ్లింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయంతో హడలిపోతున్నారు. గత నెలరోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ అటవీ శాఖ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు రాత్రి సమయంలో బయట తిరగవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.