ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన తాజా కేంద్ర క్యాబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు క్యాబినెట్ ఆమోదం తెలియచేసింది. ఈ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 16,300 కోట్లు మంజూరు చేసింది. .ఇందులో భాగంగా 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటు వెనుక అనేక లక్ష్యాలున్నాయి. మైనింగ్ రంగంలో దేశీయ ఉత్పత్తిని పెంచడం ఇందులో ప్రధానమైనది. అలాగే ఖనిజాల విషయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం రెండో లక్ష్యం. వీటన్నిటితో పాటు ఆఫ్ షోర్ మైనింగ్ వేలాన్ని ప్రోత్సహించడం మరో ప్రధాన లక్ష్యంగా ఉంది.
లిథియం, కోబాల్ట్, రాగి, నికెల్ సహా మరికొన్ని అరుదైన మూలకాలను టెక్నికల్ భాషలో క్రిటికల్ మినరల్స్ అంటారు. రక్షణ పరికరాలు, ఇతర కీలక సాంకేతిక పరిగ్నానాల తయారీకి ఈ అరుదైన మూలకాలు ఎంతో ముఖ్యమైనవి. కీలకమైన ఖనిజాలపై ప్రపంచవేదికపై భారతదేశం ఇప్పటికే చోటు సంపాదించింది. భారతదేశం, అపారమైన ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. ఈ ఖనిజ వనరుల వల్ల దేశం పారిశ్రామికంగా అలాగే ఆర్థికంగా అభివృద్ది చెందడానికి బోలెడు అవకాశాలుంటాయి. మైనింగ్ రంగంలో భారతదేశం ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి సాధించింది.
అలాగే సీ – హెవీ మొలాసిస్ తో ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్ ధర గతంలో లీటరుకు రూ. 56.28 ఉండగా, తాజాగా సదరు ధరను రూ. 57.97 కు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం మరో నిర్ణయం తీసుకుంది. కాగా బీ హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరకు రసం లేదా చక్కెర సిరప్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ రేట్లలో మాత్రం కేంద్రం ఎటువంటి మార్పు చేయలేదు. పెట్రోల్ లో ఇథనాల్ ను కలపాలన్న లక్ష్యానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.