ఏపీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవాళ ఆయన తన రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరబోనని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయలేదని చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని తెలిపారు.
మూడు తరాలుగా ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌కు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా శక్తిమేరకు పనిచేశానని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారథిగా పని చేశానన్నారు. టీడీపీతో రాజకీయంగా విభేదించానని… చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని.. తొమ్మిదేళ్లు తనను ప్రోత్సహించిన మోదీ, అమిత్‌షాలకు విజయసాయి రెడ్డి ధన్యావాదాలు తెలిపారు.
రాజ్యసభలో వైసీపీకి తగ్గుతోన్న బలం తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11మంది రాజ్యసభ సభ్యులు ఉండగా… ఇటీవలే పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు నేతలు రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్ తమ పదవులను వదులుకున్నారు. ఇప్పుడు రాజీనామా బాటలో విజయసాయిరెడ్డి ఉండడంతో.. వైసీపీ బలం 7కు తగ్గిపోయింది.