సంక్రాంతి సీజన్‌లో ఏపీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఆదాయం రూ.23 కోట్లు దాటిందని చెప్పారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈనెల 20న ప్రయాణికుల ద్వారా ఒకే రోజు రికార్డు స్థాయిలో రూ.23.71 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రికార్డు నెలకొల్పింది.
సంక్రాంతి పండుగ రోజులలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ ఆర్టీసీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.20 కోట్లు దాటింది. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులన్నీ నడపడం వల్ల, ప్రయాణికులు విశేషంగా ఆదరించారని, ఆర్టీసీ ఆదాయం రికార్డు స్థాయిలో సాధించిందని సంస్థ ఎండీ తెలిపారు.
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంస్థ 9,097 ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సంస్థకు రూ.21.11 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సంక్రాంతికి ప్రయాణికులు ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారని ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఇతర ప్రైవేటు వాహనాలు , సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారని అన్నారు.