ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో తిరుపతి చేరుకోనున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఆయన పరామర్శించున్నారు. అనంతరం టీటీడీ, ప్రభుత్వ, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
తిరుపతికి వెళ్లే ముందు ఘటనపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఘటన అనంతరం పరిణామాలపై , చర్యలపై చర్చించారు. మరోవైపు తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదికపైనా సమావేశంలో చర్చించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తమ పర్యటలను రద్దు చేసుకుని తిరుపతికి వెళ్లనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారు.
కలెక్టర్ నివేదిక
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల గేట్లు తెరవడంతో ఒక్కసారిగా భక్తులు వచ్చారని.. అందుకే తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.
తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదని.. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని వెల్లడించారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని నివేదికలో పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదని చెప్పారు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని నివేదికలో వెల్లడించారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందించారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలో 8 కేంద్రాల వద్ద టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున రావడంతో కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.