కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను వెంటనే బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను ఖండిస్తూ..తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా మెజిస్ట్రేట్లకు మెమొరాండం సమర్పించారు. నిరసనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నాయకులు పాల్గొంటారు. కాగా, ఈనెల 18న రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఒక ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. దేవుడి పేరు పదే పదే తలుచుకుంటే కనీసం స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్‌ను అమమానించినందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని..తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆరోపించారు. ఇరువర్గాల వారు పార్లమెంటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. పార్లమెంట్‌లో అమిత్ షా వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ నిరసనలతో కేంద్రం రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.