అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. గడిచిన ఒక్క ఏడాదిలోనే హైదరాబాద్‌లో 35 వేల 944 క్రైమ్ కేసులు నమోదు కావడం ఘోరమైన పరిస్థితికి అద్దం పడుతున్నదని చెప్పారు. అల్లు అర్జున్ నివాసంపై జరిగిన రాళ్ల దాడి సంఘటన పూర్తిగా పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం అని హరీశ్‌రావు విమర్శించారు.
హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అడుగంటుతున్న శాంతి భద్రతల పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతుండడం వల్ల ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో శాంతి భద్రతలు లేవనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి శాంతి భద్రతలు పునరుద్ధరించడానికి, ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.