బూడిద రవాణా కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాణరెడ్డి వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిదను సిమెంటు పరిశ్రమలో ఉపయోగిస్తారు. దీన్ని సమీపంలోని తాడిపత్రికి తీసుకెళుతుంటారు. జగన్ హయంలో ఈ వ్యవహారాన్ని వైసీపీ నేతలే చూసుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జేసీ ప్రభాకర్‌రెడ్డి వాహనాలు ఫ్లైయాష్ రవాణా చేస్తున్నాయి. అయితే, ఈసారి ఆదినారాయణరెడ్డి కుటుంబం ఆర్టీపీపీ నుంచి తాడిపత్రికి తమ వాహనాల్లోనే ఫ్లైయాష్‌ను తరలించాలని పట్టుబడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేశ్‌రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ, ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించడం లేదు. దీనిపై ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అటు జేసీ, ఇటు ఆది వర్గాలు ఎక్కడా తగ్గలేదు. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. బూడిద మా దగ్గర ఉందని.. కాబట్టి మా వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణరెడ్డి వర్గీయులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రికి కాబట్టి అవి మా వాహనాలే కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఇరువురి మధ్య పంచాయతీ పెరిగిపోయింది.
ఫ్లైయాష్ రవాణా వ్యవహారంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి కడప ఎస్పీకి తాజాగా లేఖ రాశారు. అక్టోబరు 15 నుంచి ఆర్టీపీపీ వద్ద చెరువు నుంచి బూడిదను లోడ్ చేయనివ్వకుండా తమ వాహనాలను ఆది నారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై జమ్మలమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నెల 23న కడప నుంచి వస్తున్న అన్ని సిమెంటు, ఇసుక లారీలు నిలిపివేశామన్న ఆయన…. ఇవాళ్టి నుంచి తమ వాహనాలు ఆర్టీపీపీలో లోడింగ్ అవుతాయని పేర్కొన్నారు. ఈసారి వాహనాలు ఆపితే తేలిగ్గా తీసుకోమన్న జేసీ…. వారు దౌర్జన్యం చేస్తే సైలెంట్‌గా ఉండే రక్తం మాది కాదంటూ పేర్కొన్నారు.
ఈ క్రమంలో… జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలతో కడపకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అటు ఆదినారాయణరెడ్డి వర్గీయులు జేసీని అడుగు పెట్టనివ్వమని పట్టుబట్టారు. దీంతో.. అనంతరపురం, కడప సరిహద్దులో పోలీసులు భారీ మోహరించారు. జెసి ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.