వైసీపీ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల వ్యవస్థ నాశనమైపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఓడిపోయి, 11 సీట్లు మిగిలినా వైసీపీ వాళ్ళ నోళ్లు మూతపడటం లేదని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో వైసీపీ వాళ్ల నోటి నుంచి ఇంకేమీ రాకుండా చేస్తామని లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా పవన్ కళ్యాణ్ అన్నారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదన్నారాయన. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో దీపం పథకాన్ని పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
వైసీపీ వాళ్ళకి యుద్ధమే కావాలంటే దాన్నే ఇస్తాం అన్నారు డిప్యూటీ సీఎం. గొడవే కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తామని పేర్కొన్నారు. ఆడపిల్లల మాన, ప్రాణాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కుటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసి చూపుతోందన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 2 వేల 684 కోట్లు, ఐదేళ్లకు 13 వేల 425 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. దీపం పథకం కేవలం వంటింట్లో వెలగడానికే కాదు.. పేదల ఆకలి తీర్చడానికి అని తెలిపారు.
ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి 14 ఏళ్ల క్రితం తాను వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి 14 ఏళ్ల పరీక్ష పెట్టాడన్నారు. గతంలో ఓటమితో జీవితం అంధకారం అయ్యిందన్నారు. అలాంటి సమయంలో జనసైనికులతో పాటు ధైర్యం ఇచ్చింది లక్ష్మీనరసింహస్వామి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఎస్ జగన్నాధపురం ఆలయానికి 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పవన్ పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వయంభువుగా వెలసిన లక్ష్మీనరసింహస్వామిని ఎప్పుడూ కోరుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.