ఏపీలో లిక్కర్ షాపుల లైసెన్సులకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల 424 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా భారీ స్థాయిలో అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ లైసెన్సుల కోసం అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4 వేల 839 అప్లికేషన్లు రాగా…. ఆ తర్వాతి స్థానంలో ఏలూరు జిల్లాలో 4 వేల 260 అప్లికేషన్లు వచ్చాయి. విజయనగరంలో 4 వేల 110 దరఖాస్తులు, అతి తక్కువగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో 869 మద్యం అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు మద్యం దరఖాస్తుల ప్రక్రియ ముగియనుండటంతో భారీగా టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దుచేసి ప్రైవేట్ వారికి మద్యం షాపుల లైసెన్సులు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ను ఏపీ సర్కార్ జారీచేసింది.