కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొంగులేటి కీరోల్ పోషిస్తున్నారా..! హైకమాండ్ ఆయనకు అధికంగా ప్రాధాన్యం ఇస్తోందా అంటే అవునన్న సమాధానం విన్పిస్తోంది. జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా, తిరుగులేని రాజకీయ నేతగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకోవడం వల్లే ఆయనకు ప్రభుత్వంలో, పార్టీలో అంతటి ప్రాముఖ్యత లభిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ప్రతిపక్షాలు వివిధ అంశాల్లో విమర్శలు చేస్తున్నా హస్తం అగ్రనేతలు పట్టించుకోకపోవడం కూడా ఇందులో భాగమనేనని అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు.
ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వేళ మంత్రి పొంగులేటిపైనా పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ టూ నాయకుడు అని సంబోధిస్తూ… ఓ స్టార్ హోటల్‌లో అదానీని కలిశారంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉన్నారని ఆయన చెప్పడంతో రాజకీయంగా కేటీఆర్ కామెంట్లు కాకరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు పొంగులేటిని ఉద్దేశించేనన్న మాటలు విన్పిస్తున్నాయి.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే.. కేటీఆర్ మాదిరిగా పరోక్షంగా చెప్పకుండా డైరెక్ట్‌గా చెప్పేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అదానీని హోటల్లో ఎందుకు కలిశారు.. అందులో సునీల్ కనుగోలు ఎందుకు ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు కేఏ పాల్.
మంత్రి పొంగులేటిపై ఇలాంటి తీవ్ర విమర్శలు వచ్చినా.. ఇటు రాష్ట్ర కాంగ్రెస్ కానీ, అటు జాతీయ నాయకత్వం కానీ స్పందించలేదు. ఒకవేళ పెట్టుబడుల కోసమే అయితే… ఈ భేటీ రహస్యంగా సాగాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న విన్పిస్తోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి లేదంటే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాకుండా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సమావేశం కావడం వెనుక లోగుట్టు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటీవలె మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీసులు, నివాసాలపై ఈడీ దాడులు జరిపింది. కానీ, ఆ రైడ్స్‌లో ఏం జరిగింది..? అన్నదానిపై మౌనంగా ఉంది ఈడీ. దీనిపైనా విమర్శనాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలాంటి వేళ సైతం ఏ మాత్రం స్పందించలేదు హస్తం హైకమాండ్.
ఇలా ఏరకమైన విమర్శలు మంత్రి పొంగులేటి విషయంలో వచ్చినా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం ఆయన్ను బలమైన నేతగా గుర్తించడమే అంటున్నారు ఆయన అభిమానులు. ప్రత్యేకించి తెలంగాణ ఎన్నికలకు ముందుగానే చెప్పి మరీ బీఆర్ఎస్‌ను ఖమ్మం జిల్లాలో చావుదెబ్బ కొట్టడం ఆయనకు మాత్రమే చెల్లిందని అంటున్నారు. ఇవన్నీ గమనించే మంత్రి పొంగులేటి విషయంలో హైకమాండ్ పెద్దగా స్పందించడం లేదన్న మాట విన్పిస్తోంది.


