చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన తొలి హామీని మంత్రి హోదాలో లోకేష్ ఇవాళ నెరవేర్చనున్నారు. గతేడాది జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర.. ఫిబ్రవరి 3న పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం సమీపంలో వంద కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ ప్రతి వంద కిలోమీటర్లకు శిలాఫలకం ఏర్పాటుచేసి ఓ హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులు, శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఐదు చోట హామీలిచ్చారు. వాటిలో తొలి హామీ బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు. పూతలపట్టు నియోజకవర్గంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు అప్పట్లో లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లోనే తొలి హామీని అమలు చేస్తున్నారు.