వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బ్రూనైతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. చారిత్రక బంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లడమే తన భేటీల ఉద్దేశమని చెప్పారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా ఆయన తొలుత బ్రూనై చేరుకున్నారు. మోదీని స్వాగతించడానికి యువరాజు హజీ అల్ ముహ్‌తడీ బిల్లా.. విమానాశ్రయానికి వచ్చారు. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం బ్రూనైకు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. యాక్ట్‌ఈస్ట్ విధానంలో భారత్‌కు బ్రూనై ముఖ్యమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య స్నేహపూరిత బంధాలున్నాయి. బహుళపాక్షిక అంశాలపై పరస్పరం గౌరవం, అవగాహనతో రెండు దేశాలూ ముందుకు వెళ్తున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
మోదీ బసచేసిన హోటల్ వద్దకు ప్రవాస భారతీయులు వచ్చి ఘన స్వాగతం పలికారు. వారితో ఆయన ముచ్చటించారు. విద్య, వైద్యం సహా వివిధ రంగాల్లో సేవలందిస్తూ, రెండు దేశాల మధ్య వారధులుగా నిలుస్తూ, బంధాలను బలోపేతం చేస్తున్నారని వారిని కొనియాడారు. తన చిత్రాన్ని బహూకరించిన ఓ చిన్నారికి ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. భారత హైకమిషన్ నూతన కార్యాలయ ప్రాంగణాన్ని మోదీ ప్రారంభించారు. బ్రూనైలో ప్రఖ్యాత ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. ఇవాళ ఆయన బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాతో చర్చలు జరుపుతారు. అనంతరం సింగపూర్ వెళ్తారు.