కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను కోల్‌కతా పోలీసు విభాగం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌పైన వేటు వేసింది.
హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి గత బుధవారం దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, ఔట్ పేషంట్ విభాగాలతో పాటు సీసీ టీవీలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటివరకూ పలువురిని అరెస్టు చేశారు. అర్థరాత్రి సుమారు 40 మంది వరకూ నిరసనకారుల రూపంలో వచ్చిన దుండగులు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారని, వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆందోళనల నుంచి దృష్టి మళ్లించడానికే విధ్వంసానికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు.
విధ్వంసాన్ని నిలువరించటంలో పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టు విచారణలో పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇది జరిగిన గంటల్లోనే పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆ సమయంలో అక్కడే నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. నగర పోలీస్ కమిషనర్ వినీత్‌కుమార్ గోయల్ సైతం తమవైపూ లోపాలున్నాయని మరుసటిరోజు అంగీకరించారు. దాడుల్లో పోలీసులు సైతం గాయపడ్డారని తెలిపారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు ఒక్కసారిగా ఇలా హింసాత్మకంగా మారతాయని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యామని చెప్పారు