బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్ గా మారింది. ఇటు రాష్ట్రంలో.. అటు ఢిల్లీలో బీఆర్ఎస్ మనుగడ పైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అటు ఢిల్లీలో గులాబీ పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను వారించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఈ సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు క్యూలో ఉన్నారు. ఇక ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగిపోవడం కూడా బీఆర్ఎస్కు ఊహించని పరిణామం.
రాష్ట్రంలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో నిమగ్నమైందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కమలం గూటికి నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరుతున్నట్లు వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్నారు. వీరు బీజేపీలో చేరటానికి సిద్దపడితే త్వరలోనే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీన ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. బిడ్డ కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ పెద్దలతో డీల్ కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్ కోసం కేటీఆర్, హరీశ్ రావులు స్వయంగా ఢిల్లీకి వెళ్లారని, సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని, ఈ ఒప్పందంలో భాగంగా త్వరలోనే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లుతారనే ప్రచారం కూడా జరిగింది.
తాజాగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్.. మాజీ మంత్రి హరీశ్‌రావును పొగడ్తల్లో ముంచెత్తడం కూడా ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగమనే చర్చజరుగుతోంది. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. హరీష్ రావు వివాద రహితుడని, తానేమి ఆయనతో మాట్లాడలేదని బండి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల్లో హరీశ్ ఒక్కడే మంచి నేతని కితాబిచ్చారు.
కాంగ్రెస్ నేత మధుయాష్కీ కూడా ఇదే విషయాన్ని మీడియాతో చిట్‌చాట్‌లో ప్రస్తావించడం గమనార్హం. కవితను జైలు నుంచి విడిపించేందుకు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారని మధు యాష్కీ అన్నారు. కేసీఆర్ సూచనల మేరకే కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో చర్చలు జరిపారని ఆయన పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనీ.. విలీనానికి కిషన్ రెడ్డి ఓకే చెప్పినా, బండి సంజయ్ మాత్రం హరీశ్‌రావును బీజేపీలోకి లాగి, బీఆర్ఎస్ ను చీల్చే పనిలో ఉన్నారని ఆయన చెప్పారు. అందుకే హరీశ్‌రావును బండి సంజయ్ తెగ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని, లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ బయటనుంచి మద్దతిస్తుందనే ప్రచారం జరుగుతందని అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మాజీ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీలో విలీనం అవుతుందా? లేక బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకుంటుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు మీడియాలో వస్తున్నాయని, కాబట్టి, వీటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీపై ఉన్నదన్నారు. అసద్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ విలీనంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసద్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ మజ్లిస్ స్నేహ బంధం ముగిసినట్లే అని స్పష్టమవుతోంది.
మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉంటూ వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి కూడా మంచి స్నేహం ఉన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీతో సయోధ్య కుదుర్చుకునే పద్ధతిని మజ్లిస్ పార్టీ అవలంబించింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే మజ్లిస్ పార్టీ ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉంటూ వచ్చింది. మొన్నటి వరకూ బీఆర్ఎస్తో సఖ్యంగానే మెలిగింది. కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం అందించినా మజ్లిస్ పార్టీ మాత్రం సస్పన్స్‌లోనే పెట్టింది. కానీ, తాజాగా ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలు, బీఆర్ఎస్ పార్టీపై వేసిన ప్రశ్నలు చూస్తే.. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత చెడిందని అర్థమవుతోంది.


