ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ. అలాగని బంగారం తాకట్టు రుణాలు మాఫీ పరిధిలోకి రావు. ఒక్క మాటలో చెప్పాలంటే పంట రుణాల మాఫీకి కొన్ని ప్రధానమైన నిబంధనలు ఉన్నా యంటూ తేల్చి చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి.
తెలంగాణలో పంట రుణాల మాఫీకి సంబంధించి నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా కండీషన్లు పెడతారా? ఇలా అనేక సందేహాలు రైతుల్లో నెలకొన్న వేళ వీటిపై స్పష్టత ఇచ్చారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. అయితే బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని ఢిల్లీ వేదికగా స్పష్టం చేశారు సీఎం.రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు ముఖ్యమంత్రి. పంట రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్థారణ చేస్తా మన్న ఆయన పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా పంట రుణాలను లెక్కిస్తామని ప్రకటించారు. ఒక కుటుంబం లో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువ ఉన్నా గరిష్టంగా రెండు లక్షల వరకే మాఫీ అవుతుందన్నారు. ఇలాంటి రుణాలు ఆరు నుంచి ఏడు వేల కోట్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. ఇక, రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు అతి త్వరలోనే విడుదల చేస్తామన్నారు ముఖ్యమంత్రి. దీంతో ఆ నిబంధనలు ఏంటన్నది తెలిశాకే పంట రుణాల మాఫీపై మరింత పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది.