బ్రిటీష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా.. న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దిశగా దేశ న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది. బ్రిటీష్ పాలకుల కాలం నుంచి కొనసాగుతున్న భారత శిక్షాస్మృతి-ఐపీసీ, నేర శిక్షాస్మృతి-సీఆర్‌పీసీ, భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు, ఎస్‌ఎంఎస్ పద్దతిలో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్దతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఆ సేతు హిమాచలం ఉన్న 140 కోట్ల మంది భారతీయులకు.. భారతీయులే రూపొందించిన చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇంకా చెప్పాలంటే బ్రిటీష్ కాలంలో శిక్షకు ప్రాధాన్యం ఇచ్చి రూపొందించిన చట్టాల స్థానంలో న్యాయానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన చట్టాలు తాజాగా మనదేశంలో అమలులోకి వచ్చేశాయి. బ్రిటీషర్ల నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చినా అప్పట్లోనే తయారు చేసిన భారతీయ శిక్షా స్మృతి-ఐపీసీ, నేర శిక్షాస్మృతి-సీఆర్‌పీసీ, భారత సాక్ష్యాధార చట్టం కొనసాగుతున్నాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ చట్టాల స్థానంలో ఇప్పటికే కొత్త చట్టాలు ఆమోదించగా, ఇప్పుడవి అమల్లోకి వచ్చే శాయి. గతేడాది పార్లమెంటు వీటిని ఆమోదించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ సరికొత్తగా అమలులోకి వచ్చాయి. కొత్త చట్టాలతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఎస్‌ఎంఎస్ వంటి ఆధునిక పద్దతుల్లో సమన్లు పంపడం, తీవ్రమైన నేరాలకు సంబంధించి క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోల్లో రికార్డు చేయడం వంటి ఆధునిక పద్దతులు న్యాయవ్యవస్థలో పొందు పరిచారు. చట్టాల పేరు మాత్రమేకాదు. వాటిలో చేసిన సవరణలను సైతం పూర్తిగా భారతీయ ఆత్మతో రూపొందించామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అంతేనా, కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించడంలో దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు మన పాలకులు.
పాత చట్టాలను మార్చడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది బ్రిటీష్ పాలనలో నాటి చట్టాలు శిక్షకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తే, ప్రస్తుతం రూపొందించినవి శిక్ష కంటే న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిం చారు. ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశ ద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్ని ఇప్పుడు యావజ్జీ వంగా మార్చారు. వాస్తవానికి ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. దీంతో ప్రస్తుతం వాటిని సరళంగా ఉండేలా చేశారు. ఐపీసీలో గతంలో 511 సెక్షన్లు ఉండగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్య కేవలం 358 మాత్రమే. ఐపీసీలోని ఆరు నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను సైతం ఒక సెక్షన్ కిందకు తీసుకువచ్చారు. అదే సమయంలో 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తీవ్రమైన నేరాలకు అడ్డుకట్ట వేసే విదంగా చట్టాల్లో మార్పులు చేశారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని సైతం ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. ఇక, మహిళలు, పిల్లలపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. పిల్లలను అమ్మడం, కొనడాన్ని తీవ్రమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణ శిక్ష లేదంటే జీవిత ఖైదు నిబంధన తీసుకొచ్చారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పుడు వాగ్దానాలతో మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకొని వారిని వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లల పై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదంటే వైద్యం అందించాలి. మహిళలు, పదిహేనేళ్ల లోపు ఉన్న వారు, అరవై ఏళ్లు పైబడిన వ్యక్తులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్న వారు ఇంటి నుంచే పోలీసు సహాయం పొందవచ్చు. ఇక, కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా అనే నిబంధనను చేర్చారు.
ప్రధానంగా ఈ కొత్త చట్టాల ద్వారా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఫిర్యాదుల నుంచి సమన్ల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్‌ఎంఎస్ ద్వారా సమన్లు పంపే వీలుంటుంది. ఇక, అన్నింటికంటే ముఖ్యంగా పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్ దాఖ లు చేసే విధానం జీరో ఎఫ్‌ఐఆర్ పద్దతిని ప్రవేశపె ట్టారు. కొత్త చట్టాల రాకతో ఇక నుంచి పాత చట్టాలు పూర్తిగా తెరమరుగు కానున్నాయి. అయితే కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయతే అంటోంది కేంద్ర ప్రభుత్వం. మరి వాస్తవంలో ప్రజలకు ఇవి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తాయి.. ఎంత వరకు సౌకర్యంగా ఉంటాయి అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.