ఏపీలో మెగా DSC నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరా లను రేపు అందుబాటులో ఉంచనున్నారు. జులై 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. జులై 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా DSCకి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్‌కు డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు గత YCP ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా జారీ చేసిన DSC నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6 వేల 100 పోస్టులతో విడుదల చేసిన ప్రకటనని రద్దు చేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జీఓ నం.256ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇవ్వనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్‌ను ప్రస్తుతం రద్దు చేసింది. NDA ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా DSCపై చేశారు.