అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి కాకరేపుతోంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డోనాల్డ్ ట్రంప్ బరిలో దిగారు. ఇరువురి మధ్య ఎన్నికల సంగ్రామం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. నవంబర్ 5న జరిగే ఈ ఎలక్షన్‌లో ఎవరు ఎవరిని ఢీకొట్టి అధ్యక్ష పదవిని చేజిక్కింటారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికాలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలబడనున్నారు. మరోసారి ప్రెసిడెంట్‌గా ఎన్నికవాలని బైడెన్ తాపత్రయ పడుతుంటే అతడిని గద్దె దించాలన్న వ్యూహాల్లో ఉన్నారు ట్రంప్. దీంతో ఎవరికి వారు ఎత్తుకుపై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన డిబేట్‌లోనూ ఇదే పర్వం కొనసా గింది.
సీఎన్ఎన్ మీడియా సంస్థ నిర్వహించిన తొలి డిబేట్‌లో ఢీ అంటే ఢీ అన్న రేంజ్‌లో మాటల తూటాలు సంధించుకు న్నారు ఇరువురు నేతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాల పై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. అడ్మినిస్ట్రేషన్‌లో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్ ట్రంప్ హష్ మనీ కేసులో దోషిగా తేలారంటూ బైడెన్ విమర్శించారు. ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని, దీంతో ఎకానమీ పతనమైందని విమర్శిస్తూ బైడెన్ చర్చను మొదలుపెట్టారు. ట్రంప్ స్పందిస్తూ బైడెన్ హయాంలో అక్రమ వలసదారులకే ఉద్యోగాలు దొరికాయన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందని, పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. సరిహద్దులను సేఫ్‌గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను బైడెన్ ఖండించారు. ఈసారైనా ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగితే అంగీకరిస్తానని బదులిచ్చారు. మొత్తంగా 90 నిమిషాల పాటు సాగిన డిబేట్‌లో 78 ఏండ్ల ట్రంప్ కొంత దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్నిసార్లు తడబాటుకు గురయ్యారు. డిబేట్‌లో నిర్వాహకుల ప్రశ్నలకు పోగా మొత్తంగా ట్రంప్ 23 నిమిషాల 6 సెకన్ల పాటు మాట్లాడారు. బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు తీసుకున్నారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు జో బైడెన్. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్‌లో ట్రంపే నెగ్గారని సీఎన్‌ఎన్ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి.
ఇరువురి మధ్య జరిగిన డిబేట్‌లో దూకుడుగా వ్యవహరించాడంటూ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తు తుండగా 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఉన్న అనుమానం రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన డిబేట్‌తో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకో వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్, బైడెన్ పాలనపై అసంతృప్తిగా లేని అమెరి కన్లు అసహనంగా ఉన్నారు. జో పాలన అంతంతమాత్రంగా ఉందని బైడెన్‌పై విమర్శలు వెల్లువెత్తుతుం టే కేసుల వలయంలో చిక్కుకున్న ట్రంప్‌పై కూడా అంత సుముఖంగా లేరు. రేసులో మరెవరైనా నిలబడా లన్న ఆశలో ఉన్నారు. అయితే ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించా ల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది..? ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవు తారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది.