రుషికొండపై ఉన్న భవనాన్ని ఏం చేస్తారు ? మాజీ సీఎం వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి కట్టించిన ఈ భారీ భవన సముదా యాన్ని వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అతిథి గృహంగా ఉపయోగిస్తారా లేదంటే విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైజాగ్ వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే అన్నింటినీ పర్యవేక్షిస్తారా? వందల కోట్లు పెట్టి కట్టించిన ఈ భవనాలను అసలు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారన్న దానిపైనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
సాగరతీరం విశాఖలోని రుషికొండపై ఏం జరుగుతోంది.? అత్యంత భారీగా నిర్మాణాలు ఎందుకోసం చేస్తున్నారు..? అసలు అక్కడికి ఎవరినీ ఎందుకు రానివ్వడం లేదు.? ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఎన్నో ప్రశ్నలు 2024 ఎన్నికల ముందు వరకు గుప్పించాయి ఏపీలోని విపక్షాలు. కానీ, ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు అధికారంలో ఉన్న వైసీపీ చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మాత్రం బ్రహ్మాండమైన మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడి నుంచే సీన్ మారిపోయింది.
ఈ క్రమంలోనే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం రుషికొండపై ఉన్న భవనాలను సందర్శించింది. ఈ సందర్భంగానే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూ శాయి. 400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి, అత్యంత భారీగా ఈ భవన సముదాయాన్ని నిర్మించింది నాటి వైసీపీ ప్రభుత్వం. మొదట రిసార్టులుగా ప్రచారం సాగినా ఆ తర్వాత మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఇక్కడి నుంచే పాలన సాగిస్తారన్న మాట విన్పించింది. అందుకు కారణం వైసీపీ పాలనలో మూడు రాజధానుల అంశం.కానీ, మొన్నటి ఎన్నికల్లో భిన్నమైన ఫలితం రావడంతో ఇప్పుడు ఆ భవనాలను ఏం చేయాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇంత భారీ భవనాలను వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు అధికార పక్ష నేతలు. ఈ విషయంలో జగన్ వైఖరిని తప్పు పడుతున్నారు. ఒక్కరి కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయాలా అంటూ సూటిగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతల విమర్శలను కొట్టి పారేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తెలుగుదేశం సహా కూటమి నేతలవి తప్పుడు ప్రచారాలని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఇలా ఏ వీవీఐపీ వచ్చినా ఇక్కడ ఉండేలా గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపట్టిందని చెప్పుకొచ్చారాయన. ఈ భవనాలను ఎలా ఉపయోగిం చుకోవాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచించు కోవాలన్నారు గుడివాడ.
రాజకీయ నేతల విమర్శలను ఓసారి పక్కన పెడితే రుషికొండపై మొత్తం ఏడు భవనాలను నిర్మించారు. కళింగ, గజపతి, విజయనగర, వేంగి బ్లాక్‌ల పేరుతో వీటిని నిర్మించారు. వాటిలో విజయనగర బ్లాక్-1,2 ,3 పేరుతో విల్లాలు ఉన్నాయి. ఒక్కో భవనంలో విశాలమైన గదులు, సమావేశ మందిరాలు, ఇతర వసతులు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత అధునాతన సౌకర్యాలతో ఎంతో సుందరంగా విశాలంగా వీటిని నిర్మించారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, ఈ భవనాలపై చర్చ జరుగు తున్న నేపథ్యంలో విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి ఇలా వీవీఐపీలు ఎవరు వచ్చినా ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు స్థానికులు. అప్పుడే ఇన్ని కోట్ల మేర ప్రజాధనం పెట్టి నిర్మించిన భవనాలకు నిజమైన అర్థం ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.