తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలకు సమయం దగ్గర పడింది. తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో బోనాలు ఒకటి. జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం సందడి షురూ కానుంది. ఆ రోజు నుంచే హైదరాబాద్ మహా నగరంలో బోనాల సంబరం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో బోనాల జాతరపై మంత్రులు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆషాఢ మాసం బోనాల జాతరపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ ,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం బోనాల జాతరను విజయవంతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతలు, దేవాలయాల వద్ద భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.