31.2 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

సంకీర్ణం నరేంద్ర మోడీకి కత్తిమీద సాము

    తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ నాయకులకు షాక్ ఇచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం కమలం పార్టీకి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సీట్లు రాకపోవడమే. కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు రావాలి. అయితే కమలం పార్టీ 240 సీట్లు దాటలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యంగా ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ, నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీ యూపై కమలం పార్టీ ఆధారపడక తప్పడం లేదు.

   2001లో నరేంద్ర మోడీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత రాజకీయంగా ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2001 నుంచి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ తనకు తాను స్వంతంగా మెజారిటీ సాధించడంలో ఏ ఎన్నికల్లోనూ విఫలం కాలేదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వంత బలం మీదనే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడిపారు. 2014 అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో కమలం పార్టీ స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించింది. అయితే నరేంద్ర మోడీ హవాకు తాజా లోక్‌సభ ఎన్నికలే బ్రేకులు వేశాయి. ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవ లసిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కొత్త కాదు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం అందరికీ తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా అద్భుతంగా నడిపారన్న పేరు వాజ్‌పేయి తెచ్చుకున్నారు. సహజంగా సంకీర్ణ ప్రభుత్వం నడపడం అంటే సదరు ప్రధానికి ఎంతో ఓపిక ఉండాలి. విధానపరమైన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాలి. అంతేకాదు సదరు భాగస్వామ్యపక్షాల ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా కొత్త. మోడీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏ నాడూ నడప లేదు. మోడీకి సంకీర్ణం కల్చర్ పూర్తిగా కొత్త. ఎన్డీయే కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం నడవాల్సిన అనివార్య పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దీంతో తప్పకుండా కొన్ని ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఉండి తీరతాయి. ఈ ఒడిదుడుకులు, ఒత్తిళ్లను నరేంద్ర మోడీ భరించక తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సదరు ప్రభుత్వాన్ని విజయ వంతంగా నడపడానికి అవసరమైన నైపుణ్యాల విషయంలో నరేంద్ర మోడీ ఈసారి అగ్నిపరీక్ష ఎదుర్కోబోతున్నారు.

   నరేంద్ర మోడీ నాయకత్వంలో గతంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలను స్వంతం చేసుకున్న సందర్బాల్లో సదరు గెలుపునకు కారణాలు ఆయన రాజకీయ చాతుర్యం, నైపుణ్యమేనన్న ప్రచారం ఉధృ తంగా సాగింది. లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొం టారన్న పేరు మోడీ తెచ్చుకున్నారు. అయితే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భాగస్వామ్య పక్షాలు ఒత్తిడి తీసుకువస్తే సదరు నిర్ణయాలపై పునరాలోచన చేయవచ్చు. అవసరమైతే నరేంద్ర మోడీ వెనక్కి తగ్గవచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలో ఇవన్నీ సాధారణ విషయాలే. తాజాగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వానికి కొన్ని అంశాలు కీలకం కానున్నాయి. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి, కులగణన, అగ్నిపథ్ పథకం, పౌరసత్వ సవరణ చట్టం ముఖ్యమైనవి. భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఉమ్మడి పౌరస్మృతి కొత్త అంశం కాదు. సివిల్ అంశాలకు సంబంధించి అన్ని మతాలవారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యం గా కనిపిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాలమీద ఆధారపడి సంకీర్ణ ప్రభు త్వాలను నడుపుతోంది. దీంతో పార్లమెంటులో తగినంత సంఖ్యా బలం లేక పోవడంతో వివాదా స్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ. గతంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో తగినంత సంఖ్యాబాలం ఉండ టంతో ఉమ్మడి పౌర స్మృతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

   ఇదిలా ఉంటే ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోదని గతంలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన జనతాదళ్ (యునైటెడ్‌ ) పార్టీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకించే అవకాశాలు న్నాయి. బీహార్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలను దూరం చేసుకోవాలని ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్‌ ) పార్టీ అధినేత నితీశ్ కుమార్ అనుకోరు. ఇక పౌరసత్వ సవరణ చట్టం విషయా నికి వస్తే ఇది కూడా పాత అంశమే. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన వాగ్దానాల్లో సీఏఏ అమలు కూడా ఒకటి. ప్రస్తుతం కమలం పార్టీతో జత కట్టిన జనతాదళ్ (యునైటెడ్‌ ) పార్టీ కూడా గతంలో సీఏఏను వ్యతిరేకించింది. సీఏఏను బీహార్‌లో అమలు జరిపేది లేదని ఈ ఏడాది జనవరిలో ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ కుండబద్దలు కొట్టారు. కాగా సీఏఏ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరి తెలియాల్సి ఉంది.

  ఈ ఏడాది ఏప్రిల్ 14న కమలం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల ప్రతిపాదన ఉంది. ఒకే దేశం – ఒకే ఎన్నికల నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సహజంగా లోక్‌సభ ఎన్నికలప్పుడు, జాతీయ అంశాలు తెరమీదకు వస్తుంటాయి.అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్‌సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తుంటారు. ఇదిలాఉంటే, లోక్‌సభకు, అసెంబ్లీలకు జమిలి పేరుతో ఒకేసారి ఎన్నిక‌లు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, జనతాదళ్(యునైటెడ్‌) పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే. కులగణన ఇది మరో కీలక అంశం. నితీశ్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కులగణనను విజయవంతంగా రెండు విడతల్లో నిర్వహించింది. అంతేకాదు కులగణనను దేశవ్యాప్తంగా నిర్వహిం చాలని జేడీ(యూ) కోరుతోంది. దేశంలో పెద్ద సంఖ్య‌లో ఉన్న వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జ‌ర‌గాల‌న్నా కులాలవారీగా జ‌నాభాను లెక్కించి తీరాల్సిందే. బీసీల నాయ‌క‌త్వంలో న‌డిచే ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి.

   కులాలవారీగా లెక్కలు లేన‌ట్ల‌యితే త‌మ మేలు కోసం తీసుకువ‌చ్చే చ‌ట్టాల అమ‌లులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయం టున్నారు బీసీ వ‌ర్గాల నేత‌లు. దేశ జనాభాలో కులపరంగా, ఆర్థికంగా, చ‌దువు ప‌రంగా వెనుకబడిన కులాలు అంటే ఓబీసీలు 52 శాతం ఉంటారన్న‌ది ఒక అంచ‌నా. వీరికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్‌ కమిషన్ గ‌తంలోనే సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కులగణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్‌ బలంపుంజుకొంది. అయినా 2001,2011 సెన్సస్‌లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీక‌రించలేదు. ఈ నేపథ్యంలో బీజేసీ అసాధ్యం అనుకున్న కులగణనను చేసి అందరితో శెహభాష్ అనిపించుకున్నారు నితీశ్ కుమార్. అయితే కులగణనపై చంద్రబాబు నాయుడు భిన్నమైన వైఖరి తీసుకుంటారన్న వార్తలందుతున్నాయి.

  అగ్నిపథ్ దాదాపు రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం ఇది. మెరికల్లాంటి యువత కు సైన్యంలో కొలువులు కల్పించడమే అగ్నిపథ్‌ పథకం ప్రధాన లక్ష్యం. అయితే సైన్యంలో కొలువు అంటే ఓ ఇరవై ఏళ్లో లేదా పాతికేళ్లో అని అందరూ భావిస్తారు. కనీసం పదిహేనేళ్లు అయినా ఉంటుందని ఆశిస్తారు. అయితే అగ్నిపథ్ పథకంలో కేంద్రం ఇచ్చే ఉద్యోగం కేవలం నాలుగేళ్లే ఉంటుంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తరువాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే. మరో ప్రత్యామ్నా యం లేదు. స్థూలంగా ఇదీ కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అగ్నిపథ్ పథకం అసలు రూపం. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకాన్ని మరోసారి సమీక్షించాలని జనతాదళ్ (యునైటెడ్‌ ) అలాగే లోక్‌జనశక్తి పార్టీ కోరుతున్నాయి. దేశ అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని భాగస్వామ్యపక్షాల సూచనల మేరకు సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదిఏమైనా నరేంద్ర మోడీ ఒంటెత్తు పోకడలకు ఇక చోటుండదు. పాత రాజకీయాలకు బదులు తమ ప్రయోజనాలే పార్టీలకు లక్ష్యాలు కావాలని దేశ ప్రజలు ఈ ఎన్నికలలో స్పష్టంగా తీర్పు ఇచ్చారు. సంకీర్ణ ధర్నాన్ని పాటిస్తారన్న భరోసాతోనే నరేంద్ర మోడీ నాయక త్వానికి భాగస్వామ్యపక్షాలు జై కొట్టాయి. దీనికి అనుగుణంగా నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరించాలి. సంకీర్ణ ధర్మాన్ని పాటించి తీరాల్సిందే.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్