ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం వస్తుందా! రాజధాని పనులకు త్వరలోనే శ్రీకారం చుడతారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతోనే అమరావతిపై చర్చ మొదలైంది. ఇక అమరావతికి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు వంద జేసీబీలతో గత నాలుగు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 109 కిలోమీటర్ల నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పనులను సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనుల్లో కదలిక రావడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టినా ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపే అందరు మొగ్గు చూపారు. ఎన్నికల్లో గెలిస్తే అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యా యి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో ఐదేళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయ డం ప్రారంభించారు.
గతంలో అమరావతి నిర్మాణం పీక్స్ లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి, భూ సమీకరణ చేసి, ఎన్జీటీలో పిటిషన్లను అధిగమించి పనులు ప్రారంభించే సరికి చాలాకాలం గడిచి పోయింది. ఈ సారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే రెండు, మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.


