దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయన్న నానుడి దేశంలోని వివిధ ప్రాంతాలవారికి ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. దేశ రాజధానిలో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నిన్న సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఏకంగా 56 డిగ్రీలకు చేరినట్లు తెలుస్తోంది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే హడలిపో యారు. ఇక ఢిల్లీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్, బిహార్‌లలో వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వడగాడ్పుల దెబ్బకు ఒక్కరోజులోనే 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. వివిధ జిల్లాల్లో వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నా రు. వీరిలో మధుమేహులు, బీపీ రోగులు ఎక్కువ. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో జూన్ 8 వరకు పలు సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఝార్ఖండ్‌లో ఎండలకు గబ్బిలాలు, ఇతర ప్రాణులు కూడా నేలరాలిపోతున్నాయి. రానున్న రెండ్రోజుల్లో యూపీ, దిల్లీ, చండీగఢ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.


