రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌పై విరుచుకుపడింది. జోరు వానలతో అతలాకుతలం చేసింది. ఎటు చూసినా వరద నీటితో జలప్రళయం సృష్టించింది. రెయిన్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం, రాకపోకల నిలిపివేత, నేలకొరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు ఇలా నానా బీభత్సంతో జన జీవనం అస్తవ్య స్తంగా మారింది. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే కాదు. పలు చోట్ల కూడా వానలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో అయితే గాలివాన తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ ఆదివారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. తుపాన్ ధాటికి పశ్చిమ బెంగాల్‌తోపాటు బంగ్లాదేశ్ అతలాకుతలమవుతున్నాయి. గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తీర ప్రాంతాల నుంచి దాదాపుగా లక్షా 20 వేల సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాలకు నష్టం అత్యధికంగా ఉండవచ్చని అంచనా. ఇక సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. మరోపక్క తుపాన్ ప్రభావంతో ఇప్పటికే ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో కొన్ని రైళ్లు రద్దు చేశారు. అలాగే,.. కోల్‌కతా విమానాశ్రయం లో 21 గంటల వరకూ మొత్తం 394 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు.
బంగ్లాదేశ్‌పై కూడా రెమాల్ ప్రభావం పడింది. దీంతో పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన 10 వ నెంబర్ సూచీ జారీ చేశారు. కోక్స్ బజార్, చిట్టోగ్రామ్ పోర్టుల్లో 9వ నెంబర్ హెచ్చరిక జారీ అయింది. ఇక సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే 8-10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. తుపాన్ కారణంగా చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టులో కూడా విమాన సర్వీసులు రద్దు చేశారు. రెమాల్ ఇప్పుడప్పుడే విడిచిపోదని మరో 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశాపై ప్రభావం చూపుతుందని.. ఈ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అస్సోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోపక్క తుపాను సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సమీక్షకు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ , నేవీ అధికారులు కూడా హాజరయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక రెమాల్ విరుచుకుపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మరోపక్క తెలంగాణలో గాలి, వాన బీభత్సం 14 మందికిపైగా మంది ప్రాణాలను బలి తీసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం, రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల అకాల వర్షాలు కురు స్తుండగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ బీభత్సానికి ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మృత్యువాతపడ్డారు. ఇక తుపాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని తీరప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడ పేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. రెమాల్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలు పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.