ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితను కలిసేందుకు ఆమె తండ్రి గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు వెళ్లలేదు? కవిత అరెస్టై రెండు నెలలపాటు జైల్లోనే ఉన్నా, కారు పార్టీ అధినేత ఎందుకు హస్తిన వైపు కన్నెత్తి చూడలేదు? కూతురును పరామర్శించేందుకు వస్తే విపక్షాల విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారా? అందుకే గులాబీ బాస్ సైలెంట్‌గా ఉన్నారా? అసలు కారు పార్టీ అధినేత మదిలో ఏముంది?
సార్వత్రిక ఎన్నికల వేళ దేశాన్ని కుదిపేసిన వ్యవహారాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రధానమైనది. ఈ కేసులో మార్చి 15న అరెస్టయి రెండు నెలలకు పైగా జైల్లోనే ఉంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ లిక్కర్ స్కాంపై అధికార, విపక్షాల మధ్య ఎన్నో వాగ్వాదాలు.. ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు. ఇదంతా ప్రతిపక్షాలను అణచి వేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న కుట్ర అని విపక్ష నేతలు ఆరోపిస్తుంటే.. తప్పు చేశారు కాబట్టే ఈ విచారణలు, జైలు అంటోంది అధికార బీజేపీ.
నిజానికి ఈ ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం 2022లో బయట పడింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది ఈ వ్యవహారం. తొలుత ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించగా.. ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అమిత్ అరోరాను ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయగా.. ఎమ్మెల్సీ కవిత పేరు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. దీంతో.. మొదట కవిత నివాసంలో ఆమెను విచారించింది సీబీఐ. ఆ తర్వాత ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కవితను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టైన తర్వాత.. ఆమె తల్లి, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ తోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లి పరామర్శించి వచ్చారు. అయితే.. రెండు నెలలకు పైగా సమయం అయినా ఇంతవరకు తన కూతురు కవితను చూసేందుకు, పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఢిల్లీకి రాలేదు. దీంతో.. కారు పార్టీ అధినేత ఎందుకు రాలేదన్న చర్చ సాగుతోంది.
కవిత అరెస్ట్ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లోనే ఈ అంశంపై స్పందించారు కేసీఆర్. కేంద్రంలో ఉన్న బీజేపీని ఉద్దేశిస్తూ రాజకీయంగా విమర్శలు గుప్పించారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం లేకపోయినా, రాజకీయ కక్షతోనే ఆమెను అరెస్ట్ చేశారని ఆరోపించారు. గతంలో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడంతోపాటు కమలం పార్టీ జాతీయ కార్యాలయానికి పోలీసులు వెళ్లడంతోనే తనను టార్గెట్ చేసి కవితను అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలా ఒకటీ అరా మినహా పెద్దగా స్పందించలేదు మాజీ సీఎం కేసీఆర్. ప్రస్తుతం విచారణ సాగుతున్న సమయంలో తాను ఢిల్లీ వెళ్లినా, కవితను కలిసినా ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. తాను ఏ విధంగా అడుగులు వేసినా అది విపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉందని, అందుకే న్యాయ నిపుణులతో కేసును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా, కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లలేదన్న వాదన విన్పిస్తోంది. ఒకసారి బెయిల్‌పై ఆమె బయటకు వచ్చాక దీనిపై పూర్తిస్థాయిలో గులాబీ బాస్ స్పందిస్తారని.. అప్పటివరకు ఇదే వ్యూహం తో ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


