29.7 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

తెలుగు దేశం పార్టీకి వారసుడుగా ఎన్టీఆర్ సిద్ధమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎప్పుడు వినిపించినా హాట్ టాపిక్‌గా ఉంటుంది. ఆ పేరుకు ఉన్న పవర్ అలాంటిది. అందుకే ఏపీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఒక వేళ టీడీపీ ఓడిపోతే ఎన్టీయార్ ఎంట్రీ ఖాయమన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజముంది..? అసలు తెలుగుదేశంలో ఈ వాదన మొదలై ఎన్నేళ్ల యింది..? రాను రానూ తారక్‌కు మద్దతు పెరగడానికి దోహదపడిన, పడుతున్న పరిస్థితులేంటి..? అన్నీ కలిసొస్తే పార్టీ పగ్గాలు అందుకునేందుకు తారక్‌ సుముఖమేనా..?

ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మళ్లీ తామే గెలుస్తామని గతంలో కంటే ధీమాగా సీఎం జగన్ చెప్పడంతో కూటమి పార్టీల శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఈ సారి ఓడిపోతే పరిస్థితి ఏంటి? అన్నగారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్‌గా మారారు. ఏపీ పాలిటిక్స్‌ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నట్లే అనిపిస్తోంది. రాజకీయంగా ఎన్టీయార్ తెర మీద లేకపోయినా ఆయన చుట్టే ఎందుకు రాజకీయం నడుస్తుందనేది కాస్త ఆసక్తికరమైన చర్చే. నటనతోనే కాదు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగు దేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రిగా మూడుసార్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు అందుకున్న నందమూరి తారక రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌నే అభిమానులంతా ఆదరిస్తున్నారు. అయితే రాజకీయాల పరంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు నడిపిస్తు న్నారు. కానీ చంద్ర బాబుకు ప్రస్తుతం వయసు అయిపోతోందని, ఈ సారి ఎన్నికల్లో గెలిస్తేనే వచ్చే ఐదేళ్లు ఆయన టీడీపీ అధినేతగా ఉంటారని, లేని పక్షంలో తెలుగు దేశం పార్టీ నిర్వాహక బాధ్యతలను నందమూరి కుటుంబా నికి అప్పగించాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్లవచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉంది? అనే ప్రశ్నలను టీడీపీకి చెందిన ఏ కార్యకర్తను అడిగినా వారి నుంచి వచ్చే సమాధానం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటే. జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను అందుకోగల శక్తి, సామర్థ్యాలు ఏ ఒక్కరికీ లేవనే బాహటంగా చెబుతారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు గుర్తింపు ఉంది. అంతకుమించి- చలన చిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీ రామారావు జయంతిని పురస్కరిం చుకుని ఏటేటా ప్రతి మేలో నిర్వహించే మహానాడు సభలకు క్రమం తప్పకుండా హాజరయ్యే వారు జూనియర్. 2009 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే ఎన్నికలకు మరికొద్ది రోజులు ఉండగా జూనియర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో బెడ్‌కే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కూడా ఆహ్వానిం చారు. ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపు వస్తే చాలు వచ్చేస్తానని కూడా క్లియర్ కట్‌గానే చెప్పారు. ఆ తరువాత చోటు చేసుకున్న మనస్పర్థలు, విభేదాల వల్ల దూరం అయ్యారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడి చేతుల్లో కొనసాగుతోంది. నందమూరి కుటుంబం నుంచి చేతులు మారిన టీడీపీ అధ్యక్ష స్థానం ప్రస్తుతం నారావారి ఆధీనంలో ఉంటోంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఇన్నేళ్లుగా పార్టీని సజీవంగా ఉంచుతూ వస్తున్నారాయన. ఆయన తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కాలనే అంశంపై ఇప్పటిదాకా కూడా ఎక్కడా పార్టీలో చర్చే జరగలేదు. చంద్రబాబు తరువాత తెలుగుదేశాన్ని మళ్లీ నందమూరి కుటుంబానికే అప్పగించితే బాగుంటుందని, ఆ కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీ సారథ్య బాధ్యతలను అందుకోవాల్సి ఉంటుందంటూ సాధారణ కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఇదివరకే పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ప్రత్యేకించి- సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణలో ఈ తరహా డిమాండ్ ఊపందుకునప్పటికీ.. ఆ తరువాత చప్పున చల్లారింది.

2019 ఎన్నికల్లోనే టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ చేపట్టాలనే డిమాండ్ వినిపించింది. అయితే నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారన్న వాదన వినిపించింది. మరోవైపు లోకేష్ ఇప్పటికీ తనను తాను నిరూపించుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో జూనియర్‌ రావాల్సిందేనన్న వాదనలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో తన వారసుడిగా నారా లోకేష్‌ను నిలబెట్టాలనే వ్యూహంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారనే ప్రచారం ఉంది. అందుకు అనుగుణంగా 2019కి ముందు నారా లోకేష్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ దూసుకుపోయారు. ఇప్పుడు పార్టీలో చంద్రబాబు తర్వాత లోకేషే అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్‌పై క్యాడర్‌లో ఏకాభిప్రాయం లేదనేది బహిరంగ రహస్యమే. దీనికి నిదర్శనాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్త కూడా జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారే తప్ప నారా లోకేష్‌కు పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించడానికి ఇష్టపడట్లేదు. నారా లోకేష్.. ప్రస్తుతం టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2019 నాటి ఎన్నికల్లో అమరావతికి గుండె కాయగా చెప్పుకొనే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. చంద్రబాబుతో పోల్చితే.. నారా లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు లేవని, ప్రత్యామ్నాయం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరేననేది ఓ సగటు టీడీపీ అభిమాని అభిప్రాయం.

ఏపీలో గతంలో జరిగిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు అనే చర్చ జోరుగా సాగింది. చంద్రబాబు నాయుడి చేతుల్లో ఉన్న తెలుగుదేశం నాయకత్వంపై పార్టీ క్యాడర్‌లో విశ్వాసం సన్నగి ల్లిందనే అభిప్రాయాలు అంతర్గతంగా వినిపించాయి. చంద్రబాబు స్థానంలో పార్టీ పగ్గాలను అప్పగిం చాల్సి వస్తే..ప్రత్యామ్నాయం ఎవరనేది కూడా పార్టీ నేతలకే కాదు. కిందిస్థాయి కార్యకర్త, ఓ సగటు టీడీపీ అభిమాని వరకు ఓ స్పష్టత ఉంది. టీడీపీ నాయకత్వం నారా కుటుంబం నుంచి మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లోకే వెళ్లాలనే అభిప్రాయం క్షేత్రస్థాయి టీడీపీ నేతల్లో ఎప్పట్నుంచో వ్యక్తమౌతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలోనూ వినిపించిన డిమాండ్ అది. ప్రముఖ నటుడు, నందమూరి కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలనే డిమాండ్‌ను కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభి మానులు సాక్షాత్తూ చంద్రబాబు ముందే వినిపించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకుని రావాలనే డిమాండ్. తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి వరకూ వెళ్లిందనడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మరొకటి ఉండకపోవచ్చు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆయన అభిమా నులే ఈ డిమాండ్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రకాశం జిల్లాలో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో- జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను ప్రముఖంగా ముద్రించారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. 2024 నాటికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసే ముందు.. జూనియర్‌కు అను కూలంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనుచరులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్న నాయకుడు కరణం బలరాం. పార్టీ ఉత్థాన, పతనాలను చవి చూసిన వ్యక్తి. చంద్రబాబు మనస్తత్వాన్ని దగ్గరి నుంచి పరిశీలించిన నాయకుడు. అందుకే- చంద్రబాబు తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన ఈ ఫ్లెక్సీ ద్వారా ఇప్పించినట్లు చెబుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను జూనియర్ ఎన్టీఆర్ తిరగ రాస్తాడు అని అటు అయన అభిమానులతో పాటు ఇటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీలోని ఒక వర్గం నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దే. ఆయనే నిజమైన వారసుడు. జూనియర్ వస్తేనే టీడీపీకి మళ్లీ పాతరోజులు వస్తాయి. నందమూరి ఫ్యామిలీని నారా ఫ్యామిలీ కంట్రోల్ చేస్తోంది.. ఎన్టీఆర్ వస్తే లోకేష్‌కు పోటీ అవుతారనే రానివ్వట్లేదనే అభిప్రాయం కేడర్‌లోబలంగా ఉంది. ఈ విషయంలో దివంగత నందమూరి హరికృష్ణ చంద్రబాబుతో విభేదించారు కూడా. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమవుతూ వచ్చారు. తెలుగుదేశం కోసం తాను పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఒకటి రెండుసార్లు అన్నారు. కానీ చంద్రబాబు చొరవ చూపలేదు. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ద్వారా ఎన్టీఆర్ వారసత్వం తనదేనని ప్రకటించుకోవడానికి ప్రయత్నించారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని విషయాల్లో కొంత దుమారం కూడా చెలరేగింది. ఆ సమయంలో బాలకృష్ణకు కూడా జూనియర్ ఎన్టీఆర్‌పై తీవ్రమైన ఆగ్రహం వచ్చినట్లు చెబుతారు. నందమూరి హరికృష్ణ అకాల మరణ సమయంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం మార్పేమీ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. కావాలనే తారక్‌ను నారా లోకేష్ కోసం పక్కన పెట్టారని వంశీ, కొడాలి నాని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, ఆంధ్రరాష్ట్ర గతిని మార్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న సాధించే విషయంలో నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారనే విమర్శలు నందమూరి అభిమానుల నుంచి బాహాటంగానే వినిపిస్తుంటాయి. ఎన్టీఆర్‌ కు భారతరత్న ఇప్పించుకోవడంలో చంద్రబాబు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఎన్టీఆర్ మరణానంతరం.. చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదు. అందుకే ఆయనకు భారతరత్న రాలేదనే ఆరోపణలూ ఉన్నాయి. లేకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించుకోవడం పెద్ద సమస్య కాదు. ఇక గతంలో వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని పరిశీలించింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందనే చర్చ నడిచింది. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడంలో చంద్రబాబే ప్రధాన భూమిక పోషించాడనేది ఆయన వ్యతిరేకులు చెప్పే మాట.

   నిరుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల టైంలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేనివిధంగా ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్‌తో టీడీపీ రోడ్డెక్కింది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథిగా ఎన్టీఆర్‌ వంద రూపాయల కాయిన్‌ రిలీజ్‌ చేయించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న ఎన్టీఆర్‌ వారసులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అయితే ఆ వెంటనే ఆమె బీజేపీ ఏపీ చీఫ్‌ కావడంతో ఎన్టీఆర్‌ భారతరత్నకు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని అంతా భావించారు. కట్‌ చేస్తే.. కేంద్రం బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, జన్‌ నాయక్‌ కర్పూరి ఠాకూర్‌ దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో పాటు ఆర్జేడీ చీఫ్‌ లాలూకు.. అలాగే పలువురు రాజకీయ దిగ్గజాలకు కర్పూరి ఠాకూర్‌ రాజకీయ గురువు. ఇక్కడ ఎన్టీఆర్‌తో ఠాకూర్‌కు పోలికలు అప్రస్తుతం. కానీ, ఈ ఇద్దరికీ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌ చాలాకాలం నుంచే ఉంది. పైగా నితీశ్‌ బీజేపీతో అనేక సార్లు కటీఫ్‌ కూడా అయ్యారు. అలాంటిది ఠాకూర్‌కు పురస్కారం ఇవ్వడంలో కేంద్రం తనదైన రాజకీయం ప్రదర్శించిందనుకున్నా.. ఎన్టీఆర్‌ విషయంలో ఇవతల నుంచి సరైన ఒత్తిడి కేంద్రంపైకి వెళ్లలేదనే విమర్శే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తే అడ్డుకునేవారెవరూ ఉండరు. పైగా అలా చేస్తే ఏపీలో బీజేపీ మైలేజ్‌ చాలా వరకు పెరుగుతుంది.

   సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆయన రాజకీయ వారసుడిగా సత్తా చాటలేకపోయారనేది టీడీపీలోని వారే చెప్పే మాట. హిందూపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా ఎలాంటి మంత్రి పదవి స్వీకరించలేదు. రాజకీయాలను తన బావ చంద్రబాబుకు, అల్లుడు లోకేష్‌కు వదిలేసి సినిమాలు చేసుకున్నారు బాలయ్య. పార్టీలో నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకునే కిటుకులు భోళా మనిషి అయిన బాలకృష్ణకు తెలియదని టీడీపీ అభిమానులే చెబుతున్నారు. బాలకృష్ణ ఏదైనా సూటిగా మాట్లాడతారని, ఆయనది చిన్నపిల్లాడి మనస్థత్వమని ఎన్నో వేదికలపై ఎంతోమంది నటీనటులు వెల్లడించారు. అలాంటి మనిషి ఇప్పుడు రాజకీయాలను ఒంట బట్టించుకుని పార్టీని నడపడం అయ్యే పని కాదని విశ్లేషకులు చెబుతున్నారు. నందమూరి తారక రామారావు వారసుల్లో బాలకృష్ణ కాదంటే. ఇక జూనియర్ ఎన్టీఆరే పార్టీకి పెద్దదిక్కు కావాల్సిందేనేనా? సినిమాల్లో బిజీగా ఉన్న తారక్ టీడీపీ పగ్గాలు చేపట్టేందుకు ముందుకు వస్తాడా అనేదే ఇప్పుడు హాట్‌ టాపిక్.

పార్టీకి కష్టకాలంలో తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్టీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. దాంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైతే తారక్ రాక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో మరికొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తారక్ రాజకీయాల్లోకి రావద్దని కోరుతున్నారు. సినిమాల్లోనే కొనసాగాలని వారు ఎన్టీఆర్‌కు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? రాజకీయాలపై ఆయన ఫోకస్‌ ఎలా ఉంది? అనే అంశాలు ప్రస్తుత చర్చలో భాగం అయ్యాయి. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఆసక్తి ఉందనేది అందరికీ తెలుసు. అయితే, ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదు. దానికి ఇంకా సమయం ఉందని, ఈలోగా సాధ్యమైనంత మేరకు ప్రజలను ఆకట్టుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాతే రాజకీయాలపై దృష్టి పెడుతారనే ప్రచారం ఉంది. అయితే జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలుపోటములపై ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని, ఒకవేళ టీడీపీ గెలిస్తే భవిష్యత్తులోనైనా తారక్ పగ్గాలు చేపట్టక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్ని ప్రచారాలు జరిగినా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఎన్టీఆరే కాబట్టి దేవర ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్