అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు కారులో బయలుదేరారు. గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను అల్లీ సాహెబ్, షేక్ సురోజ్‌బాషా, మహ్మద్ అయాన్, అమాన్, రెహనాబేగంగా గుర్తించారు. షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.


