తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లుతోంది. గట్టి పట్టున్న చోటే మావోయిస్టులు తమ ఉనికి కోల్పోయే పరిస్థి తులు వచ్చేస్తున్నాయి. చత్తీస్‌గఢ్‌లో వరుస దెబ్బలతో అన్నలు తమ ఉనికి కోల్పోయే స్థితికి వచ్చేశారంటున్నాయి పోలీసు బలగాలు. అయితే.. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టడం సరికాదంటున్నారు ప్రజా సంఘాల నేతలు.
సార్వత్రిక ఎన్నికల వేళ అడవిలో అన్నలకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దండకారణ్యాన్ని మొత్తం జల్లె డపడుతున్న భద్రతా దళాలు.. మావోయిస్టులను దొరికినవారిని దొరికినట్లుగా మట్టుపెడు తున్నాయి. దీంతో.. తుపాకుల మోత అడవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ప్రత్యేకించి గత కొన్ని రోజులుగా వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. మావోలకు దుర్బేద్యంగా ఉన్న నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ సహా పలు జిల్లాల్లో కొన్నాళ్లుగా కూంబింగ్ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు కూడా కలిసి రావడంతో ఇది మరింత ఎక్కువైంది. పైగా వేసవి కాలం కూడా కావడంతో ఆకులు రాలి పోవడం కారణంగా అడవులు పలుచగా మారిపోతున్నాయి. దీంతో అన్నల వేట మరింత ఉధృతం చేశాయి భద్రతా బలగాలు.
ఎక్కడిదాకో ఎందుకు గత నెలరోజుల వ్యవధిలో సుమారు వంద మంది అన్నలు చనిపోవడం అడవుల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది అడవిలో అన్నలు చనిపోయారు.గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన నాలుగో విడత ఎన్నికల వేళ సంచలనం సృష్టించింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలు, మావోయిస్టులు ఎదురుపడడంతో తుపాకుల మోత అడవిలో మార్మోగింది. అయితే.. భద్రతా దళాలు, మావోల మధ్య కాల్పులు జరగడం, చనిపోవడం అన్న విషయాలు కాసేపు పక్కన పెడితే.. ఈ ఎన్ కౌంటర్ జరిగిన విధానం చూస్తే ఒళ్లు జలదరించకమానదు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నల సంచారంపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు మెల్లగా అటు కదలడం మొదలు పెట్టాయి. దంతేవాడ, బీజాపూర్ జిల్లాలోని సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఏకంగా 9 వందల మంది వరకు భద్రతా సిబ్బంది మావోలను చుట్టుముట్టారు. అంతే.. నెత్తుటేర్లు పారాయి. దండకారణ్యం కాస్తా దద్దరిల్లింది. శవాల గుట్టలు మిగిలాయి. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఇటీవలి కాలంలో వరుసగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డ్రోన్లు సహా ఇతర అత్యంత అధునాతన పరికరాల ద్వారా అడవిలో అన్నల జాడ గురించి దాదాపుగా తెలుసుకున్న భద్రతా దళాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. దీంతో గుట్టలు గుట్టలుగా అన్నల మృతదేహాలు కన్పిస్తున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే వంద మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యా రం టేనే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.